మాయావతి రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ ఆనంద్‌

బహుజన సమాజ్‌ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి తన రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ ఆనంద్‌ను తిరిగి నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Published : 23 Jun 2024 17:32 IST

లఖ్‌నవూ: బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన రాజకీయ వారసుడిని మరోసారి ప్రకటించారు. పార్టీ బాధ్యతలను తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్‌కు తిరిగి అప్పగించారు. గతేడాది డిసెంబర్‌లోనే తన రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ ఆనంద్‌ని ప్రకటించిన మాయావతి.. మే నెలలో సార్వత్రిక ఎన్నికల వేళ కేసు నమోదు కావడంతో ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. రాజకీయ పరపక్వత వచ్చేవరకు ఆయన్ను తప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఆదివారం సమావేశమైన పార్టీ నేతలు ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీకి ఎదురైన ఘోర ఓటమిపై సమీక్షించారు. ఈ నేపథ్యంలో ఆకాశ్‌ను పదవి లోంచి తొలగించిన నెల రోజుల వ్యవధిలోనే తిరిగి నియమించడం గమనార్హం.

ఆదివారం బీఎస్పీ ముఖ్య నేతలు లఖ్‌నవూలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ ఆఫీస్‌బేరర్లు, నేతలు పాల్గొనగా.. ఆకాశ్ ఆనంద్‌ను తన రాజకీయ వారసుడిగా, బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా నియమిస్తూ మాయావతి నిర్ణయించారని ఆ పార్టీ సీనియర్‌ నేత సర్వర్‌ మాలిక్‌ మీడియాకు వెల్లడించారు. 

ఎవరీ ఆకాశ్‌ ఆనంద్‌?

ఆకాశ్‌ ఆనంద్‌ మాయావతి తమ్ముడి కుమారుడు. దాదాపు ఏడాదిన్నర కాలంగా పార్టీ వ్యవహారాలకు ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. లండన్‌లో ఎంబీఏ చేశారు. 2017లో బీఎస్పీలో చేరిన ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేశారు. పార్టీలో మాయావతి తర్వాత అత్యధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. 2022లో రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో పార్టీ వర్గాలు చేపట్టిన పాదయాత్రతో పాటు గతేడాది బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా చేపట్టిన స్వాభిమాన్‌ సంకల్ప్‌ యాత్రలో ఆయన కీలకంగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని