మమతకు శతాబ్ది రాయ్‌ షాక్‌ ఇవ్వబోతున్నారా?

మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ కీలక సమయంలో ........

Updated : 15 Jan 2021 19:37 IST

బీర్భుమ్‌ ఎంపీ దిల్లీ పర్యటనపై ఉత్కంఠ 

కోల్‌కతా: మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ కీలక సమయంలో అనేక మంది ముఖ్య నేతలు, కార్యకర్తలు పార్టీని  వీడుతున్నారు. రాష్ట్రంలో బలీయమైన శక్తిగా అవతరిస్తున్న భాజపాలో చేరుతున్నారు. దీంతో తృణమూల్‌ - భాజపా నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఎంపీ శతాబ్ది రాయ్‌ కూడా తృణమూల్‌ కాంగ్రెస్‌ పట్ల తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న ఆమె రేపు దిల్లీకి వెళ్తున్నట్టు పేర్కొంటూ చేసిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చర్చనీయాంశంగా మారింది.  

రేపు 2గంటలకు నిర్ణయం!

తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటంపై ఎదురవుతున్న ప్రశ్నలకు శతాబ్ది రాయ్‌ తన ఫ్యాన్స్‌ క్లబ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా సమాధానమిచ్చారు. తద్వారా పార్టీతో తనకున్న ఇబ్బందులను బయటపెట్టారు. ముందుగా పార్టీ కార్యక్రమాల షెడ్యూల్‌ను తెలియపరచకపోవడం వల్లే హాజరు కాలేకపోతున్నానని పేర్కొన్నారు. ఇది తనను ఎంతో మానసిక వేదనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. మూడు సార్లు బీర్భుమ్‌ ఎంపీగా కొనసాగుతున్న సినీనటి శతాబ్ది రాయ్‌.. శనివారం దిల్లీ పర్యటనకు వెళ్తున్నట్టు ప్రకటించారు. తాను తీసుకోబోయే ఏ నిర్ణయమైనా రేపు మధ్యాహ్నం 2గంటలకు తెలుస్తుందని ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు, ఆమెకు బిర్భుం జిల్లా తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌తో అభిప్రాయబేధాలున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

మానసిక వేదనకు గురవుతున్నా

‘‘నియోజకవర్గంతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. కానీ పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారని చాలా మంది అడుగుతున్నారు. వారందరికీ నేను ఒకటే చెప్పదలచుకున్నా.. అన్ని కార్యక్రమాలకు హాజరుకావాలనుకుంటున్నా. కానీ, నాకు పార్టీ కార్యక్రమాల గురించి ఎలాంటి సమాచారం ఉండటంలేదు. అలాంటప్పుడు ఎలా హాజరుకాగలను? ఈ పరిస్థితితో ఎంతో మానసికంగా వేదనకు గురవుతున్నా’’ అని శతాబ్ది రాయ్‌ తన ఫ్యాన్స్‌ క్లబ్‌ పేజీలో పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా తన సొంత కుటుంబానికి కంటే ఎక్కువ సమయం నియోజకవర్గ ప్రజలతోనే గడుపుతున్నానన్నారు. ఈ ఏడాది కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకున్నానని, మొత్తం సమయం ప్రజలతోనే ఉండాలనుకున్నట్టు పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు 2009 నుంచి తనకు మద్దతుగా నిలుస్తున్నారని.. రానున్న రోజుల్లోనూ అలాగే ఉంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు.

దిల్లీ పర్యటన సందర్భంగా భాజపాలో చేరే అవకాశం ఉందా అనే ప్రశ్నలపై స్పందించేందుకు నిరాకరించారు. దిల్లీ వెళ్తున్నానంటే దానర్థం భాజపాలో చేరేందుకు కాదని, తాను ఎంపీ గనక దిల్లీ వెళ్లొచ్చని సమాధానం చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె రేపు దిల్లీ పర్యటన సందర్భంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు,  శతాబ్దితో తృణమూల్‌ కాంగ్రెస్‌ మాట్లాడేందుకు ప్రయత్నిస్తోందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. గతేడాది డిసెంబర్‌ 19న జరిగిన అమిత్‌ షా ర్యాలీలో సువేందు అధికారితో పాటు 35మందికి పైగా నేతలు, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ భాజపాలో చేరిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

మా సహనాన్ని పరీక్షించొద్దు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని