MCD Elections: సిసోదియా, జైన్‌ ఇలాకాల్లో కాషాయ రెపరెపలే..

దిల్లీ (Delhi) మున్సిపల్‌ కార్పొరేషన్‌ (MCD Elections) ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక నేతలకు పరాభవం ఎదురైంది. మంత్రులు మనీశ్ సిసోదియా, సత్యేందర్‌ జైన్‌ నియోజకవర్గాల్లో భాజపా విజయం సాధించడం గమనార్హం.

Published : 07 Dec 2022 17:55 IST

దిల్లీ: దిల్లీ (Delhi) మున్సిపల్‌ కార్పొరేషన్‌ (MCD Elections) ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) జయకేతనం ఎగురవేసింది. మొత్తం 250 వార్డుల్లో 134 చోట్ల విజయం సాధించింది. భాజపాను గద్దెదించి మేయర్‌ పదవి దక్కించుకుంది. కానీ, కీలక నేతల నియోజకవర్గాల్లో మాత్రం ఆమ్‌ ఆద్మీకి పరాభవం తప్పలేదు. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా (Manish Sisodia), మంత్రి సత్యేందర్‌ జైన్‌ (Satyendar Jain) నియోజకవర్గాల్లో కాషాయ జెండానే రెపరెపలాడింది.

మనీలాండరింగ్‌ కేసులో జైల్లో ఉన్న సత్యేందర్‌ జైన్‌.. షాకుర్‌ బస్తీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మూడు మున్సిపల్‌ వార్డులుంగా.. మూడింటా భాజపా (BJP)నే విజయం సాధించింది. ఇక, సిసోదియా ఎమ్మెల్యేగా ఉన్న పట్‌పర్‌గంజ్‌ నియోజకవర్గంలో నాలుగు వార్డులుండగా.. ఇందులో మూడు భాజపా ఖాతాలోకి వెళ్లాయి. ఇక్కడ కేవలం ఒక్క వార్డులోనే ఆప్‌ విజయం సాధించగలిగింది.

దీంతో ఆమ్‌ ఆద్మీ పార్టీపై భాజపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. భాజపా సోషల్‌మీడియా హెడ్‌ అమిత్ మాల్వియా స్పందిస్తూ.. ‘‘అరవింద్‌ కేజ్రీవాల్‌కు సన్నిహితులైన ఇద్దరు అవినీతి మంత్రులకు తమ తమ నియోజకవర్గాల్లో ఎదురుదెబ్బే తగిలింది. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే భాజపా ఓటు షేరు ఒకశాతం పెరిగింది’’ అని అన్నారు. ‘‘సత్యేందర్‌ జైన్‌ నియోజకవర్గంలోని మొత్తం మూడు వార్డుల్లోనూ భాజపానే గెలిచింది. ఇంకెన్నాళ్లు కేజ్రీవాల్‌.. అవినీతి మంత్రికి మద్దతుగా ఉంటారు’’ అని భాజపా అధికార ప్రతినిధి షెహ్‌జాద్‌ పూనావాలా ఎద్దేవా చేశారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని