Atchannaidu: మీరు పారదర్శకత అంటే.. ప్రజలు నవ్వుతారు

పారదర్శకత గురించి వైకాపా అధినేత జగన్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడితే ప్రజలు నవ్వుతారని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, తెదేపా ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి మండిపడ్డారు.

Published : 07 Jul 2024 05:29 IST

మాజీ మంత్రి బొత్సపై అచ్చెన్నాయుడు, అమర్‌నాథ్‌రెడ్డి ధ్వజం

ఈనాడు డిజిటల్, అమరావతి: పారదర్శకత గురించి వైకాపా అధినేత జగన్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడితే ప్రజలు నవ్వుతారని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, తెదేపా ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి మండిపడ్డారు. పారదర్శకతకు పాతరేసింది మీరు.. మీ పార్టీనే అని బొత్సను ఉద్దేశించి ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిల సమావేశాన్ని పారదర్శకత కోసం ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ ఎక్స్‌లో బొత్స సత్యనారాయణ చేసిన పోస్టుపై నేతలు స్పందించారు. ఏ చర్చా లేకుండా అప్పనంగా ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించింది జగన్‌రెడ్డేనని ప్రజలు మర్చిపోలేదని గుర్తుచేశారు. ‘భలే జోకులేస్తున్నారు బొత్సా... విలేకరుల సమావేశాలు కూడా ప్రత్యక్షప్రసారం కాకుండా ఎడిట్‌ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు. దయచేసి పారదర్శకత.. వాస్తవాల్లాంటి పెద్దపెద్ద పదాలు మీరు వాడొద్దు. ఏపీ సురక్షితంగా ఉంది. మీరేం ఆందోళన చెందనక్కర్లేదు. ప్రజలకు అంతా తెలుసు. సమావేశమయ్యాక అన్ని విషయాలూ తెలుస్తాయి’’ అని బొత్సకు అచ్చెన్నాయుడు కౌంటర్‌ ఇచ్చారు. ‘‘వైకాపా అధికారంలోకి వచ్చాక దిల్లీలోని ఏపీ భవన్‌ను తెలంగాణకు ఇచ్చేస్తామని, బందరు పోర్టులో వాటాలు ఇస్తామని చెప్పారు. తెలంగాణ అధికారులు ఏపీ ఆయుష్‌ భవనం తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకుంటే మీరు మాట్లాడలేదు. పోలవరం నీళ్లు తీసుకెళ్తానని, ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని జగన్‌కు చెప్పానని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు, ఆయన కాళ్ల మీద విజయసాయిరెడ్డి పడడం... ఇలా వేటినీ ప్రజలు మర్చిపోలేదు’’ అని అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని