Anagani Satyaprasad: వైకాపా భూ కుంభకోణాల నిగ్గు తేలుస్తాం: రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌

వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ స్పష్టంచేశారు.

Published : 19 Jun 2024 06:09 IST

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, రేపల్లె అర్బన్‌ : వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ స్పష్టంచేశారు. విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎసైన్డ్‌ భూములను పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేశారని, ఈ దందాలో భాగస్వాములైన నాయకులు, అధికారులను వదలే ప్రసక్తే లేదన్నారు. వైకాపా పాలనలో గాడితప్పిన రెవెన్యూ శాఖను వంద రోజుల ప్రణాళిక ద్వారా మెరుగుపరిచి ప్రజలకు నాణ్యమైన సేవలందేలా చూస్తామని తెలిపారు. మంగళగిరిలోని భూ పరిపాలన శాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి అనగాని మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. భూ హక్కు చట్టం, రీసర్వే, పేదలకు ఎసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు, లబ్ధిదారులను మోసగించి జరిపిన కొనుగోళ్లపై చర్చించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘2019-24 మధ్య రెవెన్యూ శాఖ ద్వారా రాష్ట్రంలో జరిగిన అక్రమాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూకుంభకోణాలపై సమగ్ర అధ్యయనం చేయించి, తగిన ఆధారాలతో బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’అని వివరించారు. 

‘రాష్ట్రంలో భూముల రీసర్వే నిర్వహణ తీరు అస్తవ్యస్తంగా ఉంది. భూముల విస్తీర్ణం తగ్గడం, ఇతర సమస్యలపై ప్రజల విజ్ఞప్తుల మేరకు అవసరమైన చోట్ల మళ్లీమళ్లీ రీసర్వే చేయిస్తాం’ అని మంత్రి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని