Andhra News: సమస్యల పరిష్కారానికి అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పుండాలి: బొత్స

ఉద్యోగులంటే ప్రభుత్వానికి వ్యతిరేకత లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏ అంశమైనా కూర్చొని పరిష్కరించుకోవాలన్నదే తన విధానమని తెలిపారు. సర్వీస్‌ రూల్స్‌ సహా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలని ఉద్యోగులకు సూచించారు.

Published : 28 Nov 2022 01:40 IST

విజయవాడ: ప్రభుత్వంలో అవినీతి జరిగితే ఉద్యోగులు, సీఎం తలదించుకోవాల్సి వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్రస్థాయి ప్రథమ మహా జనసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్‌తోపాటు ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు, ఉద్యోగులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. ఉద్యోగులంటే ప్రభుత్వానికి వ్యతిరేకత లేదన్నారు. ఏ అంశమైనా కూర్చొని పరిష్కరించుకోవాలన్నదే తన విధానమని తెలిపారు. సర్వీస్‌ రూల్స్‌ సహా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలని ఉద్యోగులకు ఆయన సూచించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను జీఓఎంలో చర్చించి పరిష్కరిస్తామని వెల్లడించారు. అవసరమైతే కాళ్లు పట్టుకునైనా సమస్య పరిష్కరించుకునే నేర్పు ఉద్యోగ సంఘాలకు ఉండాలని హితవుపలికారు. సమస్యల పరిష్కారంలో సామ, దాన, భేద దండోపాయాలు సహజమేనని చెప్పారు. ఉద్యోగ సంఘాలు నేరుగా దండోపాయానికి వెళ్లడం సరికాదన్నారు. సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ అండగా ఉంటుందని బొత్స హామీ ఇచ్చారు. 

శానిటేషన్‌ ఉద్యోగులకు త్వరలో వారాంతపు సెలవు: సురేశ్‌

గ్రామ, వార్డు సచివాలయాల్లో 500కు పైగా సేవలు అందిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. స్పష్టమైన సర్వీస్‌ రూల్స్‌ ఇస్తూ పదోన్నతులు కల్పిస్తామన్నారు. పదోన్నతులు కల్పించేందుకు రోడ్‌మ్యాప్‌ సిద్ధం అవుతోందని చెప్పారు. శానిటేషన్‌ ఉద్యోగులకు త్వరలో వారాంతపు సెలవు ప్రకటిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని