Buggana: జగన్నాథగట్టుపై హైకోర్టు కడతాం: ‘సీమగర్జన’లో మంత్రి బుగ్గన

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు తెదేపా అధినేత చంద్రబాబు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated : 05 Dec 2022 15:50 IST

కర్నూలు: కర్నూలులో హైకోర్టు (AP High Court) ఏర్పాటుకు తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (Buggana) డిమాండ్‌ చేశారు. నగరంలోని జగన్నాథగట్టుపై హైకోర్టు కట్టబోతున్నట్లు ప్రకటించారు. హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ వైకాపా ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ‘సీమ గర్జన’ సభ నిర్వహించారు. ఈ సభకు మంత్రులు అంజాద్‌ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాంతో పాటు వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ కర్నూలు (Kurnool) నలుచెరుగులా 10కి.మీ. కనిపించేలా జగన్నాథగట్టుపై హైకోర్టు నిర్మిస్తామని చెప్పారు. యువకులు, రైతులు, ప్రాంత భవిష్యత్తు, గౌరవం నిలబెట్టేందుకు హైకోర్టు సాధించేవరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. కచ్చితంగా హైకోర్టు సాధిస్తామని చెప్పారు.

వైకాపా ప్రభుత్వం మాత్రమే కర్నూలులో న్యాయరాజధాని తేగలదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మళ్లీ అమరావతిలోనే రాజధాని పెడతారని వ్యాఖ్యానించారు. ‘‘అమరావతిలో రాజధాని వద్దని సీఎం జగన్‌ (CM Jagan) ఏనాడూ చెప్పలేదు. న్యాయ రాజధాని కోసం అందరం కలిసికట్టుగా అడుగులు వేయాలి. మూడు ప్రాంతాలకూ న్యాయం చేయాలన్నదే సీఎం లక్ష్యం. జగన్‌ పట్టుదలకు మారుపేరు. ముక్తకంఠంతో న్యాయరాజధాని సాధించుకుందాం. శాసన వ్యవహారాల రాజధానిగా అమరావతి కొనసాగుతుంది.’’ అని పెద్దిరెడ్డి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని