Harish rao: పేల్చేటోళ్లు, కూల్చేటోళ్ల చేతికెళ్తే తెలంగాణ మళ్లీ ఆగమవుతుంది: హరీశ్‌రావు

యాదగిరిగుట్టలో రూ.45 కోట్లతో 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి తెలంగాణ మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు.

Updated : 16 Feb 2023 17:05 IST

యాదాద్రి: బీబీసీ(BBC)లో కథనం ప్రసారం అయ్యిందని.. ఆ సంస్థలపై దాడులు జరుపుతోన్న కేంద్రం తీరుతో ప్రపంచం ముందు దేశం పరువుపోతోందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు (Minister Harish rao) అన్నారు. వార్తా కథనంలో తప్పులుంటే వివరణ ఇవ్వాలి కానీ, ఇలాంటి చర్యలు దేశ ప్రతిష్ఠను దెబ్బ తీయటమే అవుతుందని విమర్శించారు. యాదగిరిగుట్టలో రూ.45 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి  ఎంపీ బడుగుల లింగయ్య, స్థానిక ఎమ్మెల్యే గొంగడి సునీతతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. వైద్యారోగ్యంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. త్వరలోనే యాదాద్రి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుచేస్తామన్నారు. రాష్ట్రంలో మరో 9 వైద్య కళాశాలల ఏర్పాటును త్వరలో చేపడతామని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే భాజపా నేతలు కుట్రలు అంటున్నారని వారిపై విరుచుకుపడ్డారు. ‘‘ఉద్యోగ ప్రకటనలు ఇస్తే భాజపా అధ్యక్షుడు కుట్రలు అంటుంటారు. ఇలాంటి వింత నేతను ఎక్కడైనా చూశామా? అంబేడ్కర్‌ పేరుతో సచివాలయం నిర్మిస్తే దాన్నీ కూల్చేస్తామంటున్నారు. పేల్చేటోళ్లు, కూల్చేటోళ్ల చేతికెళ్తే తెలంగాణ మళ్లీ ఆగమవుతుంది. కూల్చేస్తాం.. తవ్వేస్తాం.. అనేది భారాస విధానం కాదు. దేవుణ్ని రాజకీయాలకు వాడుకునే సంస్కృతి మాదికాదు.  భాజపా నేతల్లా భారాస అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదు. చేసింది చెప్పుకొన్నా.. ప్రజలు భారాసకే ఓటు వేస్తారు’’ అని హరీశ్‌రావు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని