నిరూపిస్తే రాజీనామా చేస్తా: హరీశ్‌రావు

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో అధికార పార్టీ నాయకులపై భాజపా నాయకులు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

Published : 20 Oct 2020 00:47 IST

హైదరాబాద్‌: దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో అధికార పార్టీ నాయకులపై భాజపా నాయకులు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. తెరాస సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా విజయం తెరాసదేనని హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. భాజపా గోబెల్స్‌ ప్రచారానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోందని దుయ్యబట్టారు. ఎదుటి పార్టీలు చేసినవి కూడా తామే చేశామని చెప్పుకుంటున్నారని చెప్పారు. దుబ్బాక ప్రజలంతా తిరగబడుతున్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని హరీశ్‌రావు ఆక్షేపించారు.

బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్లలో రూ.1600 మోదీ గారు ఇస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారని హరీశ్‌రావు తప్పుబట్టారు. వారికిచ్చే పెన్షన్లలో ఒక్క పైసా కూడా కేంద్రం వాటా లేదని స్పష్టంచేశారు. రూ.1600 ఇచ్చేది వాస్తవమే అయితే రాష్ట్ర ఆర్థిక మంత్రి పదవికి, సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని హరీశ్‌ రావు అన్నారు. ఒకవేళ నిరూపించకపోతే కరీంనగర్‌ ఎంపీ పదవికి, భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా? అని బండి సంజయ్‌కి సవాల్‌ విసిరారు. రాష్ట్రానికి ఏదైనా చేశాకే మాట్లాడాలని భాజపా నేతలకు సూచించారు. ఎవరేం చేసినా నిజామాబాద్‌, హుజూర్‌నగర్‌ ఫలితాలే పునరావృతమవుతాయని ధీమా వ్యక్తంచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని