Ts News: భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు తెలంగాణకు వచ్చి విమర్శించడమా..: హరీశ్‌రావు

పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయాన్ని భారం చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 10 Jan 2022 18:44 IST

హైదరాబాద్‌: పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయాన్ని భారం చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్కు ఎదుట ఎన్టీఆర్ స్టేడియంలో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన రైతుబంధు పథకం వారోత్సవాల్లో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ పెట్టుబడులు ఇచ్చి రైతులకు ఆర్థిక భారం తగ్గిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడే హక్కు మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌కు ఉందా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. గతంలో తమను ఆదుకోమని రైతులు వస్తే పిట్టల్లా కాల్చి చంపిన రైతు హంతకుడిగా శివరాజ్‌సింగ్ చౌహాన్ పేరు పొందితే... రైతు బాంధువుడిగా కేసీఆర్ నిలిచారని పేర్కొన్నారు.

‘‘మధ్యప్రదేశ్‌లో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతుబంధు, సూక్ష్మసేద్యం వంటి పథకాలు అమలు చేస్తున్నారా? దేశంలో ఇప్పటివరకూ ఏడేళ్ల కాలంలో వ్యవసాయ రంగంపై కేసీఆర్ సర్కారు రూ.2.50 లక్షల కోట్లు వెచ్చించింది. పండిన పంట కొనమంటే మోదీ ప్రభుత్వం మొండికేసింది. రైతు వ్యతిరేకులైన భాజపా నేతలు.. రోజుకో ముఖ్యమంత్రిని తీసుకొచ్చి విమర్శలు చేయిస్తోంది. 317 జీవోను రద్దు చేయాలంటున్న భాజపా.. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15.69 లక్షల ఉద్యోగాల భర్తీ చేయకుండా యువతను మోసం చేస్తోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగాల ఖాళీలు లెక్కించి 317 జీవో మేరకు స్థానికత ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది’’

‘‘రాష్ట్రంలో 63 లక్షల మంది రైతులకు 8 విడతల్లో ఇప్పటివరకు రూ.50 వేల కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ఘనత కేసీఆర్ సర్కారుదే. సీజన్ ఆరంభంలో పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ సానుకూల విధానాల వల్ల రైతుల ఆత్మహత్యలు తగ్గాయనడానికి ఇవే నిదర్శనం. భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు తెలంగాణకు వచ్చి విమర్శించడం కాదు.. ఆయా రాష్ట్రాల్లో కేసీఆర్ సర్కారు తరహా అభివృద్ధి, ప్రజా సంక్షేమ, పథకాలు అమలు చేసి చూపిన తర్వాతే మాట్లాడాలి’’ అని మంత్రులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని