TRS: మునుగోడు తెరాసలో అసమ్మతి స్వరం.. రంగంలోకి మంత్రి జగదీశ్‌రెడ్డి

ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న మునుగోడులో తెరాస నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్టు

Published : 10 Aug 2022 19:43 IST

హైదరాబాద్‌: ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న మునుగోడులో తెరాస నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్టు తెరాస కీలక నేతలు సంకేతాలు ఇవ్వడంతో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దని సీఎం కేసీఆర్‌కు కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు లేఖ రాశారు. దీంతో తెరాస శ్రేణుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు మంత్రి జగదీశ్‌రెడ్డి రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఇవాళ నియోజకవర్గంలోని ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు.

మునుగోడులో పోటీకి నేతల మద్య తీవ్ర పోటీ..

మునుగోడు ఉప ఎన్నికలో పోటీకి తెరాస నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ టికెట్ ఆశిస్తున్నారు. అయితే, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే మరోసారి అవకాశం ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు తెరాస ముఖ్యనేతలు సంకేతాలిస్తున్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌, కర్నె ప్రభాకర్‌ను నియోజకవర్గానికే పరిమితం చేయకుండా రాష్ట్రస్థాయిలో వారి సేవలు వినియోగించుకోవాలని పార్టీ భావిస్తోందని చెబుతున్నారు. పార్టీ సర్వేలన్నీ కూసుకుంట్లకే ప్రాధాన్యమిచ్చాయని జిల్లాకు చెందిన కొందరు ముఖ్యనేతలు చెబుతున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వైపే మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గంలోని పలువురు నేతల్లో అసంతృప్తి నెలకొంది.

సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన స్థానిక నాయకులు..

కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దంటూ ఇటీవల సుమారు 12 మంది స్థానిక నాయకులు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా తెరాస గాలి వీచిన 2018 ఎన్నికల్లో కూసుకుంట్ల ఓడిపోయారని.. ఉపఎన్నికలో అభ్యర్థిని మార్చాలని కొందరు నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను సీఎం కేసీఆర్ మంత్రి జగదీశ్‌రెడ్డి రెడ్డికి అప్పగించారు. ఇవాళ హైదరాబాద్‌లోని తన నివాసంలో జగదీశ్‌రెడ్డి నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశయ్యారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు.. దాదాపు 30 మంది నాయకులు సమావేశానికి హాజరయ్యారు. మునుగోడులో గులాబీ జెండా ఎగరడం ఖాయమని పార్టీ శ్రేణులకు జగదీశ్‌రెడ్డి చెప్పారు. అధిష్టానం ఖరారు చేసిన అభ్యర్థికి పార్టీ నాయకులు అందరూ కలిసి పనిచేయాలని కోరారు. టికెట్ ఎవరికి వచ్చినా.. భవిష్యత్తులో అందరికీ తగిన అవకాశాలు ఉంటాయని నచ్చజెప్పినట్టు సమాచారం. అయినా అభ్యర్థిత్వంపై సందిగ్ధత కొనసాగడంతో.. మనుగోడు నేతలందరినీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రగతిభవన్‌కు తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని