Jagadish Reddy: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే కాంగ్రెస్‌ కాపీ కొట్టింది: మంత్రి జగదీశ్‌

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చేది ఉందా? ఇచ్చేది ఉందా? అన్నట్టుగా ఉన్నాయని మంత్రి జగదీశ్‌ రెడ్డి (Guntakandla Jagadish Reddy) ఎద్దేవా చేశారు.

Updated : 19 Sep 2023 06:17 IST

సూర్యాపేట: కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చేది ఉందా? ఇచ్చేది ఉందా? అన్నట్టుగా ఉన్నాయని మంత్రి జగదీశ్‌ రెడ్డి (Guntakandla Jagadish Reddy) ఎద్దేవా చేశారు. విజయభేరి సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై సూర్యాపేటలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అన్నీ బోగస్‌ని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్‌కు ఏనాడూ లేదన్నారు. అధికారం కోసం రాష్ట్ర నేతలు ఇచ్చిన స్క్రిప్ట్‌ను కాంగ్రెస్ అగ్రనేతలు చదివారన్నారు. 

‘‘ఎలాగైనా అధికారంలోకి రావాలని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే కాంగ్రెస్‌ కాపీ కొట్టింది. హైదరాబాద్‌లో చెప్పిన హామీలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేవు. రాష్ట్రానికో మెనిఫెస్టో పెట్టి ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేయాలని చూస్తోంది. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజల ముందు వారి పాచికలు పారవు. మోదీ పాలనతో విసుగు చెంది కేసీఆర్ వంటి ప్రత్యామ్నాయం లేనందునే కర్ణాటకలో ప్రజలు మీకు ఓటు వేశారు. వారంటీలు లేని గ్యారెంటీలు ఇచ్చి కర్ణాటకను ఆగం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్‌ పార్టీ చేసిన కాలయాపన వల్లే ఇక్కడ ఆత్మబలిదానాలు జరిగాయి. కాంగ్రెస్‌ చర్యలతో తెలంగాణ రెండు తరాల భవిష్యత్‌ను కోల్పోయింది’’ అని మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని