‘పవన్‌కు రాజకీయాలపై అవగాహన లేదు’

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు రాజకీయాలపై అవగాహన లేదని మంత్రి కొడాలి నాని విమర్శించారు. హిందుత్వంపై భాజపాకు నిజమైన గౌరవం ఉంటే అంతర్వేది సహా పలు ఘటనపై సీబీఐ దర్యాప్తు ..

Published : 05 Apr 2021 01:19 IST

ఏపీ మంత్రి కొడాలి నాని విమర్శలు

గుడివాడ: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు రాజకీయాలపై అవగాహన లేదని మంత్రి కొడాలి నాని విమర్శించారు. హిందుత్వంపై భాజపాకు నిజమైన గౌరవం ఉంటే అంతర్వేది సహా పలు ఘటనలపై సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయలేదని నిలదీశారు. కృష్ణా జిల్లా నందివాడలో తెదేపా తరఫున  జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన దాసరి మేరీ విజయకుమారి మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడుతూ పవన్‌పై విమర్శలు గుప్పించారు.

పవన్‌కు సినిమాలు తప్ప రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదన్నారు. మాజీ మంత్రి  వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగింది తెదేపా ప్రభుత్వ హయాంలోనేనని.. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ నేతలు గతంలో జగన్‌, అతడికి సంబంధించిన వ్యక్తులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని నిలదీశారు. సీబీఐ పరిధిలో ఉన్న కేసును ఎవరు దర్యాప్తు చేయాలని ప్రశ్నించారు. తిరుపతిలో ఎన్నికల ప్రచార వేదికపై పవన్‌ ఆరోపణలు చేసింది తమపై కాదని.. భాజపాను ఉద్దేశించేనన్నారు. ‘‘భాజపాకు దేవుళ్లు, గుడులపై నమ్మకముంటే అంతర్వేదిలో రథం దగ్ధమైతే కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదు? ఈ విషయంలో సీబీఐ విచారణ వేసి నిందితులను పట్టుకోవాలని కేంద్రాన్ని పవన్‌ ఎందుకు ప్రశ్నించడం లేదు?’’ అని కొడాలి నాని నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని