KTR: రామరాజ్యమని చెప్పి.. రావణకాష్ఠం చేశారు: కేటీఆర్‌

హైదరాబాద్‌ నగరాభివృద్ధికి సూచిక రహదారులు, ప్రజా రవాణా వ్యవస్థేనని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 21 Jun 2022 14:54 IST

కూకట్‌పల్లి: హైదరాబాద్‌ నగరాభివృద్ధికి సూచిక రహదారులు, ప్రజా రవాణా వ్యవస్థేనని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరంలో ఈ 8 ఏళ్లలో తెరాస ప్రభుత్వం 30 ఫ్లైఓవర్లు నిర్మించిందని.. మరో 17 నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. కూకట్‌పల్లి పరిధిలోని కైతలాపూర్‌ వద్ద రూ.84 కోట్లతో నిర్మించిన ప్లైఓవర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో కేటీఆర్‌ మాట్లాడారు. ఎస్‌ఆర్‌డీపీ ఫేజ్‌-1లో భాగంగా రూ.8,052 కోట్లతో 47 కార్యక్రమాలు చేపట్టామన్నారు. రూ.3,115 కోట్లతో రెండో దశ ఎస్‌ఆర్‌డీపీ పనులు చేపట్టినట్లు చెప్పారు.  

అవి నేర్చుకునేందుకు యువత మిలిటరీలో చేరాలా?

దేశంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని కేటీఆర్‌ విమర్శించారు. భాజపా నేతలు కుల మతాల మధ్య పంచాయితీ పెడుతున్నారని ఆరోపించారు. అగ్నిపథ్‌ పేరుతో యువత పొట్టకొడుతున్నారని ఆక్షేపించారు. అగ్నిపథ్‌ శిక్షణలో బట్టలు ఉతకడం, హెయిర్‌ కట్‌, డ్రైవింగ్‌ నేర్పిస్తారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారని.. అవి నేర్చుకునేందుకు దేశ యువత మిలిటరీలో చేరాలా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. దేశాన్ని రామరాజ్యం చేస్తామని చెప్పి.. రావణకాష్ఠం చేశారని ఆయన ఆరోపించారు. 

దమ్ముంటే నాపై కేసులు పెట్టండి..

‘‘ఐడీపీఎల్‌ విషయంలో పోలీసులు కేసులు పెట్టండి.. ఇక్కడ రోడ్లు ఎలా వేస్తారని హైదరాబాద్‌కు చెందిన ఓ కేంద్రమంత్రి అంటున్నారు. మీరు కొత్తగా కనీసం పైసా పనిచేయరు. కానీ పోలీసు కేసులు పెట్టాలని ఆదేశాలిస్తున్నారు. మీకు దమ్ముంటే.. చేతనైతే మున్సిపల్‌ మంత్రిగా తనపై, రాష్ట్ర ప్రభుత్వంపై కేసులు పెట్టండి. అంతేకానీ ఇంజినీర్లు, కార్మికులపై పెట్టొద్దు. చేతనైతే రక్షణ రంగానికి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించండి. కంటోన్మెంట్‌ ప్రాంతంలోనూ అద్భుతంగా ఫ్లైఓవర్‌లు, స్కైవేలు కడతాం. హైదరాబాద్‌ అంటే దేశంలోనే అద్భుతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉన్న నగరంగా తీర్చిదిద్దుతాం. ఆ బాధ్యత మాది. చేతనైతే సహాయం చేయండి తప్ప మంచి పనులు చేస్తుంటే అడ్డుకోవద్దు’’ అని కేటీఆర్‌ హితవు పలికారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని