KTR: దమ్ముంటే పార్లమెంట్‌లో చట్టం తీసుకురండి.. మేం మద్దతిస్తాం: కేటీఆర్‌

పాలమూరు జిల్లా, రాష్ట్రానికి ఏం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆయన పాదయాత్రను

Updated : 18 Apr 2022 19:32 IST

బండి పాదయాత్ర అడ్డుకోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదని వ్యాఖ్య

హైదరాబాద్‌: పాలమూరు జిల్లా, రాష్ట్రానికి ఏం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆయన పాదయాత్రను అడ్డుకోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదని చెప్పారు. హైదరాబాద్‌లో తెరాస ప్లీనరీ ఏర్పాట్లపై పార్టీ నేతలతో సమావేశం అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ఏ ఆలయానికైనా నిధులిచ్చారా?

రాష్ట్రంలో పాలనపై విమర్శలు చేస్తున్న బండి సంజయ్‌.. పక్కనే భాజపా అధికారంలో ఉన్న కర్ణాటక వెళ్లి ప్రభుత్వ పనితీరు తెలుసుకోవాలని కేటీఆర్‌ హితవు పలికారు. కావాలంటే ఏసీ కార్లు పెట్టి పంపిస్తామని.. అక్కడికి వెళ్లి పాలన చూసి సిగ్గు తెచ్చుకోవాలన్నారు. కర్ణాటకలో మంత్రులు 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నారంటూ కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. భాజపా అధికారంలో ఉన్న గుజరాత్‌లో విద్యుత్‌ కోసం రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. అక్కడ పవర్‌ హాలిడేలు కూడా ఇస్తుంటే ఎవరి కోసం బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణలో ఆలయాల అభివృద్ధికైనా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందా అని కేటీఆర్‌ నిలదీశారు. జోగులాంబ, భద్రాద్రి, వేములవాడ.. ఇలా ఏ ఆలయానికైనా నిధులు ఇచ్చారా? అని మండిపడ్డారు. పనికిమాలిన కూతలు మాని ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మీరు అమలు చేస్తామంటే మేం వద్దంటున్నామా?

రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని భాజపా నేతలు చెబుతున్నారని.. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరని కేటీఆర్‌ ప్రశ్నించారు. దేశమంతా ఉచిత విద్య, వైద్యం అమలు చేస్తామంటే తాము వద్దంటున్నామా? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై భాజపాకు దమ్ముంటే పార్లమెంట్‌లో చట్టం చేయాలని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. పార్లమెంట్‌లో చట్టం తీసుకొస్తే తాము మద్దతిస్తామని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వడం లేదని.. పక్కనే కర్ణాటకలో ఉన్న అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు ఇచ్చారన్నారు. భాజపా పాలిత రాష్ట్రాలకు రూ.వేల కోట్లు ఇచ్చి సహకరిస్తున్నారని.. ఇక్కడ నీతి ఆయోగ్‌ చెప్పినా ఇవ్వడం లేదనే పాదయాత్ర చేస్తున్నారా? అని బండి సంజయ్‌ను ఉద్దేశించి కేటీఆర్ దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని