KTR: కేసీఆర్‌ను తిట్టడం.. డబ్బా కొట్టుకోవడం తప్ప బండికి ఇంకేం చేతనైతది: కేటీఆర్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లాలను లక్ష్మీనగరంగా భావిస్తారని.. అందుకే ఏ సంక్షేమ పథకం మొదలుపెట్టిన ఇక్కడి నుంచే ప్రారంభిస్తారని మంత్రి...
కరీంనగర్: 9 నెలల్లోపు ఉద్యోగాల భర్తీ.. జూన్ నుంచి 57 ఏళ్లు నిండిన వాందరికీ ఆసరా పింఛన్లు.. సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.3లక్షల ఆర్థిక సాయం... ఇవి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ ప్రకటనలు. రాష్ట్ర అభివృద్ధికి చేపడుతున్న పనులు వివరించిన మంత్రి.. కేంద్ర ప్రభుత్వం, బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించారు. రూ.వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు కరీంనగర్ వచ్చిన మంత్రి కేటీఆర్‌కు జిల్లాలో ఘన స్వాగతం లభించింది. తిమ్మాపూర్ వద్ద తెరాస శ్రేణులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. కరీంనగర్ వరకు భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. బోనాలు.. డప్పు చప్పుళ్లతో గులాబీ కార్యకర్తలు హోరెత్తించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లాలను లక్ష్మీనగరంగా భావిస్తారని.. అందుకే ఏ సంక్షేమ పథకం మొదలుపెట్టిన ఇక్కడి నుంచే ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి మొదటి సభ కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ నుంచే శంఖారావం పూరించారని చెప్పారు. పర్యటనలో భాగంగా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంటలో తెరాస కార్యకర్త కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. మృతి చెందిన తెరాస కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షల చెక్కు అందించారు. అనంతరం అక్కడ నుంచి ర్యాలీగా కరీంనగర్ వెళ్లారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో రూ. 410 కోట్లతో చేపట్టే మానేరు రివర్ ఫ్రంట్ పనులకు, నగరంలో ప్రతి రోజు మంచి నీటి సరఫరా పథకానికి సంబంధించిన మిషన్ భగీరథ పైలాన్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
ఎన్నికలు ఉన్నా.. లేకపోయినా అభివృద్ధి పనులు చేస్తున్నాం..
‘‘పెన్షన్లు 10 రేట్లు పెంచి ఆత్మగౌరవాన్ని పెంచింది తెలంగాణ ప్రభుత్వమే. నాలుగు లక్షల బీడీ కార్మికులకు రూ.2 వేలు పింఛన్ ఇస్తున్నాం. దివ్యాంగులకు 6 రెట్లు పింఛన్ పెంచిన ప్రభుత్వం మనది. ఆడబిడ్డలకు మేనమామల మాదిరిగా కల్యాణ లక్ష్మీ ఇస్తున్నాం. వచ్చే సంవత్సరం ఇక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు కానుంది. ఉమ్మడి జిల్లాలో నాలుగు మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. ఇక మెడిసిన్ చదివేందుకు ఉక్రెయిన్, రష్యాకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒక్కరోజే రూ.1000 కోట్ల పనులకు శంకుస్థాపన చేశాం. గతంలో దిగువ మానేరు డ్యామ్ నీళ్ల కోసం గొడవలు జరిగేవి.. కానీ నేడు ఇంటింటికీ నల్లాలు పెట్టి నీళ్లు ఇస్తున్న ప్రభుత్వం మనది. 24 గంటలు నీళ్లు ఇచ్చేందుకు ఎన్ని రూ. కోట్లు అయినా ఖర్చు చేస్తాం. ఎన్నికలు ఉన్నా.. లేకపోయినా అభివృద్ధి పనులు చేస్తున్నాం. నగరంలో ఉన్న సమస్యలు తెలిసేలా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రూ.617 కోట్లతో అభివృద్ధి పనులు పరుగులు పెడతాయి. 1600 డబుల్ బెడ్రూం ఇళ్లు త్వరలో లబ్ధిదారులకు అందిస్తాం. బడ్జెట్‌లో ప్రతిపాదించిన విధంగా నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో ఇళ్లు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
కరీంనగర్ యువత కోసం ఏం చేసినవ్?
‘‘వినోద్ కుమార్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు నగరానికి స్మార్ట్ సిటీ హోదా తీసుకొచ్చారు. మరి ఇప్పుడు గెలిచిన ఎంపీ కరీంనగర్‌కు ఏం తీసుకొచ్చారు? ఇక్కడ రూ. వందల కోట్ల విలువైన అభివృద్ధి పనులను చేపడుతున్నాం. మీరు కనీసం రూ.3 కోట్లు నిధులు తీసుకొచ్చారా? కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని బండి సంజయ్ ఎనాడైనా అడిగారా? నేతన్నల కోసం క్లస్టర్ అయినా తెప్పించారా?కరీంనగర్ యువత కోసం ఏం చేసినవ్? తెల్లారి లేస్తే హిందూ, ముస్లిం అంటావ్.. కనీసం గుడి అయినా తీసుకొచ్చారా? మంత్రి గంగుల కమలాకర్ వేంకటేశ్వర స్వామి గుడి తీసుకొచ్చారు. కేసీఆర్‌ను తిట్టడం, డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఏమి చేతనైతది. కేంద్రం తరఫున కరీంనగర్ జిల్లాకు ఏమి చేసిండో బండి సంజయ్‌కే తెలియాలి. డబుల్ ఇంజిన్ అంటున్నారు.. ఇక్కడ బండి సంజయ్, అక్కడ మోదీ ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం రూపాయి తెస్తే ఎంపీలు మరో నాలుగు రూపాయలు తీసుకురావాలి. మతం అనే పిచ్చి కడుపు నింపదు. భారతదేశానికి బువ్వ పెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఉంది. ఈసారి కరీంనగర్‌లో కమలాకర్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచేలా అభివృద్ధి పనులు చేస్తాం’’ అని కేటీఆర్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
-
Vijay antony: కుమార్తె మృతి.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ పోస్ట్
-
Sai Rajesh: నా సాయం పొందిన వ్యక్తే నన్ను తిట్టాడు: ‘బేబీ’ దర్శకుడు
-
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే.. ఈ రికార్డులు నమోదవుతాయా?
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
NTR: ‘ఏఐ’ మాయ.. ఎన్టీఆర్‌ని తలపించేలా.. ఫొటో వైరల్