‘త్వరలోనే లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు పూర్తి’

పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని.. పట్టణాల్లో గుణాత్మక మార్పు తెచ్చే దిశగా ముందకెళ్తున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Published : 25 Mar 2021 01:15 IST

అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని.. పట్టణాల్లో గుణాత్మక మార్పు తెచ్చే దిశగా ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పట్టణాల్లో మౌలిక వసతులు, జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీనికోసం ప్రతి నెలా ఠంచనుగా రూ.148 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. వాటిలో జీహెచ్‌ఎంసీకి రూ.78 కోట్లు, పురపాలికలకు రూ.70 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసనసభలో కేటీఆర్‌ మాట్లాడారు. గత ఏడాది పురపాలికలకు రూ. 1,766 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో ప్రతి పురపాలికలో ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ మార్కెట్లు, 71 పురపాలికల్లో మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.250 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

‘‘టీఎస్‌ బీపాస్‌ ద్వారా 14,408 భవన నిర్మాణ అనుమతులు లభించాయి. ఈ విధానం ద్వారా వేగంగా, అవినీతి రహితంగా అనుమతులు ఇస్తున్నాం. ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం పెడుతూ పట్టణ పేదలకు అండగా ఉన్నాం. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా హైదరాబాద్‌ నగర విస్తరణపై దృష్టి సారించాం. ఇందుకుగాను హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టాం. మూడు నియోజకవర్గాలకు ఉపయోగపడేలా రూ.387 కోట్లతో చేపట్టిన బాలానగర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం తుది దశకు చేరుకుంది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నగరంలోని కోకాపేటలో రూ. 268 కోట్లతో లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,500 కోట్ల మేర ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఉప్పల్‌, మెహదీపట్నంలో రెండు ఆధునిక స్కైవాక్‌ నిర్మాణాలు చేపడుతున్నాం. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.

హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు త్వరలోనే పూర్తి అవుతాయి. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి రూ.9,714 కోట్లను ఖర్చు చేశాం. ఎస్‌ఆర్డీపీ కింద రహదారుల అభివృద్ధిని చేపట్టాం. 2050 నాటికి హైదరాబాద్‌ విస్తరణ, పట్టణ జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతో ఈ బడ్జెట్‌లో రూ.2,381 కోట్లు కేటాయించాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా 20 వేల లీటర్ల వరకు ఉచితంగా మంచినీటిని అందిస్తామని చెప్పాం. దీని ద్వారా హెచ్‌ఎండబ్య్లూఎస్‌పై పడే రూ.480 కోట్ల భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది’’ అని కేటీఆర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని