KTR: ఆస్కార్‌కు ప్రతిపాదనలు పంపితే.. మోదీకి ఉత్తమ నటుడు అవార్డు: మంత్రి కేటీఆర్‌

వచ్చే ఎన్నికల్లో భారాసను గెలిపించి.. కేసీఆర్‌ను హ్యాట్రిక్‌ సీఎం చేయాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా పిట్లంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Updated : 15 Mar 2023 17:57 IST

కామారెడ్డి: దేశ సంపదను ప్రధాని మోదీ.. అదానీకి దోచిపెడుతున్నారని మంత్రి కేటీఆర్‌ (Minister KTR) విమర్శించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. భాజపా తెలంగాణకు పట్టిన దరిద్రమని దుయ్యబట్టారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలంలోని నాగమడుగు ఎత్తిపోతల పథకానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. మంజీరా నదిపై నిర్మించిన వంతెనను ప్రారంభించారు. అనంతరం పిట్లంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. భాజపా (BJP), కాంగ్రెస్‌ (Congress)పై నిప్పులు చెరిగారు. 

‘‘55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ తెలంగాణకు ఏం చేసింది? ఇన్నేళ్లల్లో ఏమీ చేయని నాయకులకు మళ్లీ ఎందుకు అవకాశం ఇవ్వాలి. మనదేశంలో అద్భుతమైన నటుడు ప్రధాని మోదీ. ఆస్కార్‌కు ప్రతిపాదనలు పంపితే మోదీకి  ఉత్తమ నటుడు అవార్డు వచ్చేది. దేశ సంపదంతా మిత్రుడు అదానీకి దోచిపెట్టి ఆయన నుంచి తన పార్టీకి చందాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు. కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇంకా చాలా హామీలిచ్చి ఇప్పటివరకు ఒక్కటి  కూడా నెరవేర్చలేదు. అయినా సిగ్గు లేకుండా రాష్ట్రానికి వచ్చి మాట్లాడుతున్నారు.  కేంద్ర ప్రభుత్వం రూ.70 ఉన్న పెట్రోల్‌ను రూ.115 చేసింది. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.400నుంచి రూ.1200కు పెంచింది. అన్ని నిత్యావసరాల ధరలు పెంచి పేదల మీద భారం మోపింది.

దేశానికి ఇంత అన్యాయం చేస్తున్న మోదీ దేవుడా? ఆయన అదానీకి దేవుడనేది వాస్తవం. దేశ సంపదనంతా దోచి దోస్తుకు మాత్రమే సమర్పించినందుకు అదానీకి దేవుడు కావొచ్చు కానీ మనకు కాదు. తెలంగాణకు పట్టిన దరిద్రం ఏదన్న ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. మోదీకి, ఈడీకి భయపడే ప్రసక్తే లేదు. ఎవరు నీతిమంతులో.. ఎవరు అవినీతిపరులో ప్రజాక్షేత్రంలో 2023లో ప్రజలే తీర్పు చెబుతారు. ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్‌, భాజపా వాళ్లు తెలంగాణకు వస్తరు. ఓట్లు వేయమని అడుగుతరు. రాష్ట్రానికి ఏం సాయం చేయనివాళ్లకు ఓట్లు ఎందుకు వేయాలి. అలాంటివాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టాలి. వచ్చే ఎన్నికల్లో భారాసను గెలిపించి.. తిరిగి కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని ప్రజలను కేటీఆర్‌ కోరారు.

రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అండగా ఉంటూ కేసీఆర్‌ ప్రభుత్వం న్యాయం చేసిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి గురుకులాలు పెట్టిందని తెలిపారు. ముదిరాజ్‌లు, గంగపుత్రులకు రూ.వెయ్యి కోట్లతో ద్విచక్రవాహనాలు ఇచ్చామన్నారు. విదేశాల్లో చదువుకునే వారికి రూ.20లక్షల ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని