KTR: బండి సంజయ్‌, రేవంత్‌ ఒక్కసారైనా పరీక్ష రాశారా?: కేటీఆర్‌

దేశంలో సరిపడా బొగ్గు దొరికినా, విదేశాల నుంచే దిగుమతి చేసుకునేందుకు మోదీ ప్రభుత్వం మొగ్గు చూపుతోందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. సిరిసిల్లలో నిర్వహించిన పార్టీ ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

Updated : 27 Mar 2023 18:57 IST

సిరిసిల్ల: విద్యా వ్యవస్థలో సిరిసిల్ల జిల్లా ముందుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ ఏడాది సిరిసిల్లకు వైద్య కళాశాల, ఇంజినీరింగ్‌, నర్సింగ్ కళాశాల తీసుకొచ్చామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాలగానీ, నవోదయ కళాశాలగానీ ఇవ్వలేదని విమర్శించారు. సిరిసిల్లలో భారాస పార్టీ ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు. నాలుగేళ్లలో కేంద్రం ఏం సాధించిందో బండి సంజయ్‌ను ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

‘‘శ్రీకాంతాచారి బలిదానం గురించి తెలియనివారు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఏపీ, తెలంగాణ వేరుపడటంపై తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని ప్రధాని పార్లమెంట్‌లో అన్నారు. తెలంగాణ పుట్టుకనే అవమానించారు. గుజరాతీల చెప్పులు మోసేవారు మన రాష్ట్రంలో పుట్టడం దురదృష్టం. దేశంలో సరిపడా బొగ్గు దొరికినా, విదేశాల నుంచే దిగుమతి చేసుకునేందుకు మోదీ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. తద్వారా అదానీ లాంటి వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటోంది’’ అని కేటీఆర్‌ విమర్శించారు. బొగ్గు దిగుమతి ధర పెరిగితే దానికి అనుగుణంగా విద్యుత్‌ ఛార్జీలు కూడా పెరిగి ప్రజలపై భారం పడుతుందని అన్నారు. పీక్‌ అవర్‌లో విద్యుత్‌ ఛార్జీలు 20శాతం పెంచాలని కేంద్రం ప్రతిపాదించడం దారుణమని కేటీఆర్‌ విమర్శించారు.

తెలంగాణ సాధన గొప్ప అనుభవం

‘‘పార్టీ లేకపోతే మాకు పదవుల్లేవు. గుర్తింపు లేదు.. ఎన్నికలున్నా లేకున్నా నాకు పార్టీయే ముఖ్యం. అన్నం తిన్నమో.. అటుకులు బుక్కినమో.. తెలంగాణ సాధించడం మాకు గొప్ప అనుభవం. ప్రతి నియోజకవర్గానికి 100 దళితబంధు యూనిట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 38,000 యూనిట్లు మంజూరు చేశాం. దళిత బంధుతో కార్లు కొనడం దుకాణాలు కొనడం కాదు. పదిరలో ప్రభుత్వం రూ.30 లక్షలు ఇస్తే రూ.3కోట్లతో మిల్లు పెట్టడం ఎంతో ఆనందంగా ఉంది. ఇందులో 12 మంది బిహార్ నుంచి వచ్చిన వాళ్లు పని చేస్తుంటే ఎంతో తృప్తిగా ఉంది. దళితబంధులో భాగంగా 9మంది కలిసి పెట్రోల్ బంకు పెట్టడానికి సిద్ధమౌతున్నారని తెలిసింది. ఇది మరిచిపోలేని అనుభూతి. ఉమ్మడి ఏపీలో ఉత్తమ గ్రామ పంచాయతీలంటే గంగిదేవిపల్లి, అంకాపూర్ మాత్రమే ఉండేవి. కానీ, ఇప్పుడు 20 ఉత్తమ గ్రామపంచాయతీలను గుర్తిస్తే.. అందులో 19 తెలంగాణకు రావడం గర్వకారణం’’ అని కేటీఆర్‌ అన్నారు.

రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతోందని కేటీఆర్‌ అన్నారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ ఏడేళ్లలో జరిగిందో లేదో ప్రజలే చెప్పాలన్నారు. ‘‘ఆత్మీయ సమ్మేళనాల్లో ఫీడ్ బ్యాక్ తీసుకొని మేనిఫెస్టో రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. వచ్చే నెల 27లోగా ఆ పని చేద్దాం. ప్రతి 10 గ్రామాలకు ఒక యూనిట్ తీసుకుందాం. జిల్లాలో లక్షా 72వేల మంది సభ్యత్వాలు ఉన్నాయి. వారందన్నీ తట్టి లేపుదాం. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన తీరును వాళ్లకు గుర్తు చేయాలి. దశాబ్దాలపాటు పాలించిన పార్టీలు ఏం చేశాయి? మనం ఏం చేశామో ప్రజలకు చెప్పాలి’’ అని కేటీఆర్‌ అన్నారు. ఆసరా పింఛన్లలో వచ్చిన తేడా.. కల్యాణలక్ష్మి గురించి చర్చించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులకు హెక్టారుకు రూ.25వేల పరిహారం ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించారు కదా.. దేశంలో ఈ స్థాయిలో ఇచ్చిన సీఎం ఎవరైనా ఉన్నారేమో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

అదానీకి మోదీ బ్రోకర్‌ అని చెప్పొచ్చు కానీ,

‘‘ పేపర్‌ లీకేజీ కేసులో సీఎం బ్రోకర్‌ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. అదానీకి మోదీ బ్రోకర్‌ అని నేనూ చెప్పొచ్చు. కానీ, చెప్పను. బండి సంజయ్‌, రేవంత్‌ రెడ్డి జీవితంలో ఒక్కసారైనా పరీక్షలు రాశారా? నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ నకిలీ సర్టిఫికెట్లు పెట్టి దొరికిపోలేదా? రేవంత్‌రెడ్డి ఇప్పుడు నా పీఏ తిరుపతి వెంటపడ్డారు. గత 15 ఏళ్లుగా తిరుపతి నా పీఏగా ఉంటున్నారు. నా పీఏ ప్రశ్నాపత్రాలు అమ్ముకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. మల్యాలలో 415 మంది పరీక్ష రాస్తే 35 మంది పాసయ్యారు. తిరుపతి సొంతూరులో ముగ్గురు పరీక్ష రాస్తే ఒక్కరు కూడా పాస్‌ కాలేదు. సిరిసిల్ల జిల్లాలో 3,250 మంది గ్రూప్‌-1 పరీక్ష రాశారు. అందులో 255 మందికి 25 నుంచి 90 మార్కులు వచ్చాయి. ఒక్కరికి కూడా 100 మార్కులు రాలేదు.’’ అని కేటీఆర్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని