Nara Lokesh: ప్రజలు తిరస్కరించారని అంగీకరించలేకపోతున్నారా?

వైకాపా అధ్యక్షుడు జగన్‌కు ప్రజాస్వామ్యమంటేనే ఎలర్జీ అని ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ‘2019 ఎన్నికల్లో వైకాపా గెలిచినప్పుడు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌(ఈవీఎం)లు గొప్పగా పనిచేశాయన్న మీరు.. ఇప్పుడు ఓడిపోగానే వాటి విశ్వసనీయతను నిందిస్తారా’ అని జగన్‌ను నిలదీశారు.

Published : 19 Jun 2024 03:26 IST

గెలిస్తే మీ విజయం.. ఓడితే ఈవీఎంల తప్పా?
జగన్‌కు మంత్రి లోకేశ్‌ సూటి ప్రశ్నలు

ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా అధ్యక్షుడు జగన్‌కు ప్రజాస్వామ్యమంటేనే ఎలర్జీ అని ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ‘2019 ఎన్నికల్లో వైకాపా గెలిచినప్పుడు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌(ఈవీఎం)లు గొప్పగా పనిచేశాయన్న మీరు.. ఇప్పుడు ఓడిపోగానే వాటి విశ్వసనీయతను నిందిస్తారా’ అని జగన్‌ను నిలదీశారు. ప్రజల్ని మీరు వంచించిన తీరు గ్రహించి, వారు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారని అంగీకరించలేకపోతున్నారా అని ప్రశ్నించారు. ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు సమష్టిగా నిర్మించుకున్న వ్యవస్థల్ని విధ్వంసం చేశారని ‘ఎక్స్‌’ వేదికగా లోకేశ్‌ మంగళవారం ధ్వజమెత్తారు. ప్రజా హక్కుల్ని పరిరక్షించే రాజ్యాంగ వ్యవస్థల్ని వైకాపా అరాచక పాలనలో క్రమపద్ధతిలో నాశనం చేశారని మండిపడ్డారు. ‘రాష్ట్ర ప్రజలు జగన్‌ నుంచి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కోరుకుంటున్నారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఫర్నీచర్‌ని ఎప్పుడు తిరిగిస్తున్నారు? రూ.560 కోట్ల ప్రజాధనంతో రిషికొండ ప్యాలెస్‌ ఎందుకు నిర్మించుకున్నారు? వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాక ఈవీఎంల విశ్వసనీయతను జగన్‌ కొనియాడిన వీడియోని తన పోస్ట్‌కి లోకేశ్‌ జత చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని