Nimmala Ramanaidu: రాయలసీమను మోసం చేసిన జగన్‌: జలవనరులశాఖ మంత్రి నిమ్మల ధ్వజం

రాయలసీమ బిడ్డనని చెప్పుకొనే మాజీ సీఎం జగన్‌ తన పాలనలో రాయలసీమను కూడా మోసం చేశారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.

Published : 19 Jun 2024 03:44 IST

పాలకొల్లు, న్యూస్‌టుడే: రాయలసీమ బిడ్డనని చెప్పుకొనే మాజీ సీఎం జగన్‌ తన పాలనలో రాయలసీమను కూడా మోసం చేశారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాలకొల్లులో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం రాయలసీమకు రూ.12,500 కోట్లు ఇస్తే జగన్‌ హయాంలో కేవలం రూ.2 వేల కోట్లు ఇచ్చి మమ అనిపించారని తెలిపారు. నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత వైకాపాదేనన్నారు. గత ఐదేళ్లలో కాలువల్లో తట్టమట్టి కూడా తీయలేదన్నారు. వ్యవసాయాన్ని జగన్‌ గాలికొదిలేశారని మండిపడ్డారు. చిన్నచిన్న పనులు చేసిన గుత్తేదారులకు రెండేళ్లుగా బిల్లులు ఇవ్వలేదని.. వారు పనులు చేయాలంటే భయపడే పరిస్థితి తెచ్చారన్నారు. నీటిపారుదల వ్యవస్థలో కీలకంగా ఉండే లస్కర్లకు ఏళ్ల తరబడి జీతాలు ఇవ్వ లేదని నిమ్మల ఆవేదన వ్యక్తం చేశారు.  సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబులో చాలా ఆవేదన కనిపించిందని చెప్పారు. లోటు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రంలో 2014 నుంచి పోలవరం పనులు పరుగులు పెట్టించి డయాఫ్రమ్‌ వాల్‌ను పూర్తిచేస్తే తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆ పనులను నిరుపయోగంగా వదిలేయడంతో భారీ నష్టం వాటిల్లిందన్నారు. జగన్‌ చేసిన విధ్వంసానికి రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని