Nimmala Ramanaidu: పోలవరం ప్రాజెక్టును క్లిష్టతరం చేశారు: మంత్రి నిమ్మల రామానాయుడు

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తిచేస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Updated : 20 Jun 2024 16:26 IST

అమరావతి: రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తిచేస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లో మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కీలకమైన జలవనరుల శాఖ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

గత ప్రభుత్వం వ్యవసాయం, రైతుల పట్ల నిర్లక్ష్యం వహించిందని.. కాలువల్లో నీరు పారకుండా చేశారని మంత్రి నిమ్మల ఆరోపించారు. గుర్రపుడెక్క తొలగింపు సహా పూడికతీతపై తొలి సంతకం చేసినట్లు చెప్పారు. గేట్లు, షట్టర్లు, లాకుల మరమ్మతు కోసం నిధులు విడుదల చేస్తున్నామన్నారు. వర్షాల సీజన్‌లో వరదలకు ఏటి గట్లు తెగిపోకుండా ముందస్తు చర్యలకు ఆదేశాలు ఇచ్చామని వివరించారు. సాగునీరు, వ్యవసాయ రంగాలను జగన్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని.. వాటిని గాడిలో పెట్టాల్సి ఉందన్నారు. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో సాగునీటికి రూ.80వేల కోట్ల కేటాయింపులు చేశామని గుర్తుచేశారు. 

పోలవరం ప్రాజెక్టు ద్వారానే రాష్ట్రం మొత్తాన్ని సస్యశ్యామలం చేయగలమని మంత్రి చెప్పారు. 2019-24 మధ్య పోలవరాన్ని విధ్వంసం చేశారని.. వైకాపా ప్రభుత్వం ఆ ప్రాజెక్టును 20 ఏళ్లు వెనక్కి నెట్టిందని విమర్శించారు. ప్రాజెక్టును క్లిష్టతరం చేశారన్నారు. ఆ సవాళ్లను అధిగమించి పోలవరాన్ని పూర్తిచేస్తామని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైకాపా నేతలు తమ తప్పులను సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని