Perni Nani: తమాషాలు చేస్తున్నారా? మర్యాదగా ఉండదు: మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం

పోలీసు అధికారులపై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌, సీఎం జగన్‌ పోలవరం పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా

Updated : 04 Mar 2022 15:29 IST

పోలీసు అధికారులపై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌, సీఎం జగన్‌ పోలవరం పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి హోదాలో పేర్ని నాని అక్కడికి వెళ్లారు. అక్కడ మంత్రి కారు అడ్డుగా ఉందని.. దాన్ని పక్కకు తీయాలని ప్రోటోకాల్ సిబ్బంది చెప్పడంపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

వివరాల్లోకి వెళితే.. కేంద్రమంత్రి, సీఎం పర్యటన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రాజెక్టు సమీపంలోకి ఎవరికీ అనుమతించడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు, పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలను కూడా అనుమతించకపోవడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ఉన్న పేర్ని నాని పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. మంత్రి వాహనం అడ్డుగా ఉందని.. దాన్ని తీయాలని చెప్పడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న పోలీసు అధికారిని ఉద్దేశిస్తూ ‘‘ఈ కార్లన్నీ ఎవరివి?తమాషాలు చేస్తున్నారా? కారు తీయమన్నది ఎవరు?ఎస్పీ, డీఐజీ కార్లు ఇక్కడెందుకు ఉంటాయి?నాకంటే వాళ్లు ఎన్ని డిసిగ్నేషన్లు తక్కువ?మర్యాదగా ఉండదు’’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలను కూడా అనుమతించపోవడం మంత్రి ఆగ్రహానికి కారణమైంది. అనంతరం పోలీసుల నుంచి ఆ మేరకు అనుమతి లభించడంతో ఆయన శాంతించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని