AP 3 Capitals: అది మోదీ ప్రభుత్వం.. ఇది జగన్‌ ప్రభుత్వం..: పేర్ని నాని

తాము ఏ నిర్ణయం తీసుకున్నా, ప్రజల మంచి కోసమేనని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రస్తుతం ఉన్న మూడు రాజధానుల

Updated : 22 Nov 2021 16:46 IST

అమరావతి: తాము ఏ నిర్ణయం తీసుకున్నా, ప్రజల మంచి కోసమేనని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రస్తుతం ఉన్న మూడు రాజధానుల వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారు. అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు వస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శాసనసభ నుంచి బయటకు వచ్చిన మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

‘‘ఎవరో ఒకరి కోసం జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవటం, వ్యవస్థలను నడపటం చేయదు. ఈ ప్రభుత్వానికి అనేక విజ్ఞాపనలు వస్తున్నాయి. రాజధాని వికేంద్రీకరణపై టెలివిజన్‌ ఛానళ్లు తప్పుగా ప్రచారం చేస్తున్నాయి. మూడు రాజధానులు ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నామో ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాకు అనిపించింది. అందుకే మరోసారి సమగ్ర బిల్లును తీసుకొస్తాం. తమ ప్రాంతాలకు కావాల్సిన  అవసరాలను బిల్లులో పొందుపరచాలని ఎవరైతే ఆకాంక్షిస్తున్నారో వారి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి మళ్లీ బిల్లులో జత చేస్తాం. అప్పుడు సభ ముందుకు తీసుకొస్తాం’’

‘‘ఈసారి కోర్టు జోక్యం లేకుండా ప్రభుత్వం చట్టం చేయాలనుకుంటోందనేది ఊహాజనితం. అవన్నీ ఒక టెలివిజన్‌ ఛానల్‌, రాజకీయ విశ్లేషకులు చెప్పేవి. మాకు వ్యతిరేకంగా కోర్టు ఎన్నో తీర్పులు ఇచ్చింది. మేము ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమే. కొన్నిసార్లు మాకు వ్యతిరేకంగా కోర్టులో తీర్పు రావచ్చు. దానికీ దీనికి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది. మేము అలా చేయటం లేదు. అది మోదీ ప్రభుత్వం.. ఇది జగన్‌ ప్రభుత్వం.. మళ్లీ అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలను, ఆకాంక్షలను తీసుకుని బిల్లు తయారు చేస్తాం. బిల్లు ఎప్పటిలోగా తీసుకొస్తామన్నదానికి సమయం ఏమీ లేదు’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని