Ponnam Prabhakar: కిషన్‌రెడ్డి.. కేంద్రమంత్రిగా హైదరాబాద్‌కు ఏం చేశారు?: మంత్రి పొన్నం

పార్లమెంట్‌ సభ్యుడిగా.. కేంద్రమంత్రిగా ఉండి హైదరాబాద్‌ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని తెలంగాణ మంత్రి పొన్న ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

Published : 11 Jul 2024 15:48 IST

హైదరాబాద్‌: పార్లమెంట్‌ సభ్యుడిగా.. కేంద్రమంత్రిగా ఉండి హైదరాబాద్‌ అభివృద్ధికి కిషన్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్న ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేసినట్లుగా, అభివృద్ధి కుంటుపడినట్లుగా కిషన్‌రెడ్డి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. గాంధీభవన్‌లో మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. కేంద్రం హైదరాబాద్‌ను స్మార్ట్‌ సిటీ చేయలేదని, అమృత్‌ పథకం నుంచి ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతోనే రాజకీయ లబ్ధి కోసం హైదరాబాద్‌ను విమర్శిస్తున్నారని ఆక్షేపించారు.

‘‘హైదరాబాద్‌.. చారిత్రక నగరం ఇస్తాంబుల్‌ వంటిది. చార్మినార్‌, గోల్కొండ వంటి ఆర్కియాలజీకి సంబంధించి ఎన్నో ఉన్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిగా గత ఐదేళ్లలో కేంద్రం నుంచి హెరిటేజ్‌, టూరిజం, ఆర్కియాలజీ విభాగాల నుంచి హైదరాబాద్‌కు కిషన్‌రెడ్డి ఏం తెచ్చారు? ఒక్క రూపాయి అయినా తెచ్చారా? మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు కావాలని అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. హైదరాబాద్‌లో 151 ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు నీటి నిల్వలతో సమస్యలు ఏర్పడుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఇంఛార్జి మంత్రిగా ఇక్కడి సమస్యలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. వీలైతే హైదరాబాద్‌ అభివృద్ధికి సహాయం చేయండి.

కేటీఆర్‌ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది

భాజపాపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక నిధులు తీసుకురాలేకపోయిన కేటీఆర్‌.. ఇప్పుడు హైదరాబాద్‌ గురించి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. భూకబ్జాలు, అక్రమ కట్టడాలతో హైదరాబాద్‌ ఇలా కావడానికి కారణం కేటీఆరే. మా ప్రభుత్వం వచ్చి ఆరు నెలలే అయింది. ఈ ఆరు నెలల్లో జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో అనేక సమీక్షలు నిర్వహిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నాం. బోనాల పండగ తర్వాత నేరుగా బస్తీల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తాం.

విద్యార్థులూ.. ప్రతిపక్షాల ఉచ్చులో పడకండి

ఎన్నికల కోడ్‌ కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైయ్యాయని అడిగింది ప్రతిపక్షాలే. ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదీ వీళ్లే. ఈ పదేళ్లలో టెట్‌, డీఎస్సీ నిర్వహించనోళ్లు ఇప్పుడు నిరుద్యోగులను ఎందుకు రెచ్చగొడుతున్నారు? నిజమైన సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని విద్యార్థి సంఘాల నాయకులను కోరుతున్నా’’అని మంత్రి పొన్నం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని