Telangana News: కర్ణాటకలో గెలుపు చూసి.. రేవంత్‌రెడ్డి పగటికలలు కంటున్నారు: ప్రశాంత్‌రెడ్డి

అభివృద్ధి మరిచి మతాలు, దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపా పట్ల యావత్‌ దేశ ప్రజలు విసుగు చెందారనేందుకు కర్ణాటక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

Updated : 13 May 2023 22:32 IST

హైదరాబాద్‌: అభివృద్ధి మరిచి మతాలు, దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపా పట్ల యావత్‌ దేశ ప్రజలు విసుగు చెందారనేందుకు కర్ణాటక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారును తిరస్కరించిన కర్ణాటక ప్రజలు భాజపాకి చెంపదెబ్బలాంటి తీర్పునిచ్చారన్నారు. భాజపా 40శాతం కమీషన్‌ అవినీతి పాలన ఓ వైపు అయితే, మరో వైపు ప్రభుత్వ రంగసంస్థలు అమ్ముతూ దేశ సంపద అంతా మోదీ స్నేహితుడు అదానీకి ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా వచ్చిన సొమ్ముతో ప్రభుత్వాలను కూలుస్తూ, నీచ రాజకీయాలకు ఒడిగట్టారని మంత్రి ధ్వజమెత్తారు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి, దేశ భద్రతనే గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భాజపా అసమర్థ, అవినీతి పాలన వల్ల గ్యాస్‌ సిలిండర్‌ ధర, పెట్రోల్‌ డీజిల్‌, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కర్ణాటకలో గెలుపు చూసి తెలంగాణలోనూ ఏదో చేస్తామని ఇక్కడి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్‌, భారాస ప్రభుత్వానికి తప్ప.. కాంగ్రెస్‌, భాజపాకు చోటు లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని