Telangana News: ఆ విషయంలో కేంద్రం ఆశ చూపించినా కేసీఆర్ ఒప్పుకోలేదు: ప్రశాంత్‌రెడ్డి

కేంద్ర ప్రభుత్వం రూ.5వేల కోట్ల రుణ పరిమితి ఆశ చూపడంతో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో వచ్చే 6 నెలల్లో విద్యుత్ మీటర్లు పెట్టడం పూర్తి చేస్తామని అక్కడి మంత్రి అంటున్నారని....

Published : 13 May 2022 02:28 IST

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రూ.5వేల కోట్ల రుణ పరిమితి ఆశ చూపడంతో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో వచ్చే 6 నెలల్లో విద్యుత్ మీటర్లు పెట్టడం పూర్తి చేస్తామని అక్కడి మంత్రి అంటున్నారని తెలిపారు. కేంద్రం ఆశ చూపించినప్పటికీ మోటార్లకు మీటర్లు పెట్టే విషయంలో సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు. రూ.5వేల కోట్లు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ రైతులే తనకు ముఖ్యమని సీఎం తేల్చి చెప్పినట్లు పేర్కొన్నారు. పాలమూరుకు నీళ్లు రాకుండా కృష్ణా జలాల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని మంత్రి విరుచుకుపడ్డారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్, వేల్పూర్, ఏర్గట్ల మండలాలకు చెందిన పలువురు భాజపా, కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు ప్రశాంత్ రెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పిన ప్రశాంత్‌ రెడ్డి.. పార్టీలోకి ఆహ్వానించారు.

‘‘ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం ఇవ్వలేదు. భాజపా ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, బండి సంజయ్‌లు చేతనైతే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా తెప్పించాలి. ప్రధాని మోదీ దేశాన్ని అదానీ, అంబానీలకు అమ్ముతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలను గుజరాత్‌కు తరలించుకు పోతుంటే రాష్ట్ర భాజపా ఎంపీలు ఏమీ చేయలేకపోయారు. ఇవాళ ఏం వారం.. రేపు ఏం వారం.. అంటూ తిరుగుతున్న బండి సంజయ్‌కు అభివృద్ధి మాత్రం అక్కర్లేదు. కేసీఆర్ పైకి తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై వస్తున్నాయి. సరైన సమయంలో సరైన విధంగా ప్రజలే వారికి గుణపాఠం చెప్తారు. తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాలపై విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంత మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. గుజరాత్, ఉత్తర ప్రదేశ్ గ్రూప్-1 ఉద్యోగాలతో పాటు.. యూపీఎస్సీ నిర్వహించే ఉద్యోగాల్లోనూ ఉర్దూ ఉంటుంది. అంత మాత్రాన దేశమంతా ముస్లిం కలెక్టర్లు ఉన్నారా? భాజపా ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, బండి సంజయ్‌ పరీక్షలపై ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు’’ అని మంత్రి ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని