TG News: అభివృద్ధి కావాలన్న ఎమ్మెల్యేలు... కాంగ్రెస్‌లో చేరండన్న మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌కు చెందిన పలువురు భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో శనివారం సచివాలయంలో ఆరుగురు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబును కలవడం చర్చనీయాంశమైంది.

Updated : 07 Jul 2024 04:17 IST

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: హైదరాబాద్‌కు చెందిన పలువురు భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో శనివారం సచివాలయంలో ఆరుగురు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబును కలవడం చర్చనీయాంశమైంది. ‘ముందు మీరు కాంగ్రెస్‌లో చేరండి... మీ నియోజకవర్గాల్లో అభివృద్ధి బాధ్యత మాదే’ అని ఆయన వారితో అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయనే ఉద్దేశంతో మంత్రిని కలిసినట్లు కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌ ‘ఈనాడు’కు తెలిపారు. ఈ సందర్భంగా అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. తమ నియోజకవర్గాల్లో సమస్యలపై ఎమ్మెల్యేలు మంత్రి వద్ద ఏకరవు పెట్టడంతో పాటు వినతిపత్రాలు అందజేశారు. అనేక నిర్మాణాలు పూర్తయ్యాయని, వాటిని ప్రారంభించడానికి అధికారులు సహకరించడం లేదని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మీ సమక్షంలోనే ప్రారంభించుకుందామని మంత్రి దగ్గర ప్రతిపాదించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక అటు బల్దియాకు, ఇటు నియోజకవర్గాల్లో అభివృద్ధికి సంబంధించి నిధుల విడుదల నిలిచిపోయిందని శ్రీధర్‌బాబుకు వివరించారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు చెందిన అధికారులు, ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించి సమస్యలపై చర్చించాలని ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మంత్రిని కోరారు. సమస్యలపై త్వరలోనే సీఎం రేవంత్‌ను కలవబోతున్నామన్నారు. ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలు ఆలకించిన మంత్రి ‘మీ నియోజకవర్గాల అభివృద్ధి, మీరు చెప్పిన సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదే. ముందు మీరు కాంగ్రెస్‌ పార్టీలో చేరి ప్రభుత్వానికి ప్రత్యక్షంగా తోడ్పాటు అందిస్తే బాగుంటుంది. ఈరోజు కాకపోయినా రేపైనా ఆలోచించండి’ అని ఎమ్మెల్యేలను మంత్రి కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యేలు ‘అబ్బే... కాంగ్రెస్‌లో చేరే ఉద్దేశం లేదు.. భారాసలోనే ఉంటాం.. అభివృద్ధికి సహకరించండి’ అని కోరారు. మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్‌ (కుత్బుల్లాపూర్‌), సుధీర్‌రెడ్డి (ఎల్బీనగర్‌), అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి), మాధవరం కృష్ణారావు(కూకట్‌పల్లి), బండారి లక్ష్మారెడ్డి(ఉప్పల్‌), మర్రి రాజశేఖర్‌రెడ్డి(మల్కాజిగిరి) ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు