కేసీఆర్ లేకపోతే ఈటల ఎక్కడ?: శ్రీనివాస్ గౌడ్‌

తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే మాజీ మంత్రి ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ

Published : 13 Jun 2021 01:08 IST

హైదరాబాద్‌: తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే మాజీ మంత్రి ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అన్నం పెట్టిన పార్టీని విమర్శించడం మంచిది కాదని హితవు పలికారు. హైదరాబాద్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, తెరాస లేకపోతే ఈటల రాజేందర్‌ ఎక్కడ ఉండేవారని నిలదీశారు. కేసీఆర్, తెరాస లేకుండానే స్వతంత్రంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారా? అని ప్రశ్నించారు. పార్టీలోకి రాకముందు, వచ్చిన తర్వాత తన పరిస్థితి ఏంటో ఆత్మవిమర్శ చేసుకోవాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌తో గ్యాప్‌ ఉంటే ఈటలకు మంత్రి పదవి ఎలా వచ్చిందో చెప్పాలన్నారు.

తనకు నచ్చని పార్టీలోకి ఈటల ఎందుకు వెళ్లాల్సి వస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలని శ్రీనివాసగౌడ్ సూచించారు. విరసం నేత వరవరరావును జైల్లో పెడితే కేసీఆర్ పరామర్శించ లేదన్న ఈటల.. జైల్లో పెట్టిన అదే పార్టీలో ఎందుకు చేరుతున్నారో చెప్పాలన్నారు. ఈటల రాజేందర్ నిరాశ, నిస్ఫృహలతో మాట్లాడుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో అభివృద్ధి చేసే పార్టీకి.. అభివృద్ధిని అడ్డుకునే పార్టీకి మధ్య పోటీ అని మంత్రి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని