TRS vs BJP: దేశవ్యాప్త ఎన్నికలకు తెరాస సిద్ధం: తలసాని

కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశ వ్యాప్త ఎన్నికలకు తెరాస సిద్ధమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ స్పష్టం చేశారు.

Published : 16 May 2022 02:02 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశ వ్యాప్త ఎన్నికలకు తెరాస సిద్ధమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నారని ఇష్టారీతిన వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. ఒకేసారి ఎన్నికలకు వెళ్దాం.. ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఉద్దేశించి తలసాని అన్నారు.

మా వెంట వస్తే ఇళ్లు చూపిస్తాం..

గుజ్‌రాత్‌లో రెండు పడక గదులు ఇళ్లు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. రెండు పడక గదుల ఇళ్లు నిర్మించలేదనే వారు తమ వెంట వస్తే భవనాలు చూపెడతామని తలసాని అన్నారు. పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్‌ అంటూ ప్రశంసించారు. హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని బండమైసమ్మలో రూ.27.50కోట్లతో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

మిగతా మంత్రులకు ఏం చెబుతారు..

మంత్రి పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికే అని అమిత్‌షా అన్నారని.. ఆ కుటుంబం కాని వారు కూడా మంత్రులుగా ఉన్నారని తలసాని చెప్పారు. వారికి అమిత్‌షా ఏం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు. కేంద్ర మంత్రి హోదాలో అమిత్ షా ఇలా మాట్లాడడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ సంపదను ప్రధాని మోదీ అదాని, అంబానీలకు దోచిపెడుతున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభీ వాణీదేవి, కలెక్టర్ శర్మన్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని