
అల్పాహారమే.. రాజకీయం లేదు: మిథున్ చక్రవర్తి
ముంబయి: పశ్చిమ బెంగాల్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నవేళ ప్రముఖ సినీనటుడు మిథున్ చక్రవర్తి ఇంటికి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే, దీంట్లో ఎలాంటి రాజకీయమూ లేదని మిథున్ చక్రవర్తి స్పష్టం చేశారు. ముంబయిలో మిథున్‌కి చెందిన మాధ్ ఐలాండ్ హోంను భగవత్ మంగళవారం ఉదయం సందర్శించారు. దీనిపై మిథున్ మాట్లాడుతూ.. మోహన్ భగవత్‌తో తనకు ఆధ్యాత్మిక అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయన ముంబయి వచ్చినప్పుడు తన ఇంటికి రావాలన్నది ముందుగా అనుకున్నదేనన్నారు. తాను లఖ్‌నవూలో షూటింగ్ ముగించుకొని ముంబయికి వచ్చానని, అలాగే, ఆయన కూడా ఇక్కడే ఉండటంతో ఇంటిని సందర్శించారని తెలిపారు. తన వాళ్లందరినీ నాగ్‌పూర్‌కు తీసుకొని రావాలని అడిగారన్నారు. మోహన్ భగవత్ తన ఇంట్లో అల్పాహారం స్వీకరించినట్టు తెలిపారు. అంతేతప్ప ఎలాంటి రాజకీయ అంశాలూ తమ మధ్య చర్చకు రాలేదన్నారు. 2019లో వీరిద్దరూ నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో కలుసుకున్నారు.
మిథున్ చక్రవర్తికి తన సొంత రాష్ట్రమైన బెంగాల్లో ‘మిథున్ దా’గా మంచి పాపులారిటీ ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా ముంబయిలోనే ఉంటున్నప్పటికీ బెంగాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. మిథున్ చక్రవర్తి గతంలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అయితే, ఏప్రిల్ లేదా మే నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఆయన ఇంటికి మోహన్ భగవత్ వెళ్లడంతో మిథున్‌ను భాజపా సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందన్న వదంతులు రావడంతో వాటిని ఆయన కొట్టిపారేశారు.