Mla Buchepalli: దర్శి వైకాపా ఎమ్మెల్యే హల్‌చల్‌

అధికార అండతో ఇన్నాళ్లూ  దౌర్జన్యాలకు పాల్పడిన వైకాపా నాయకులు ఇప్పుడు కూడా అదే మార్గంలో వెళుతున్నారు.

Published : 06 Jul 2024 05:40 IST

 300 మందితో మండల సర్వసభ్య సమావేశానికి హాజరు
గత పాలనలో మంచినీటి సమస్య తీర్చలేదని తెదేపా శ్రేణుల నిలదీత

ఎమ్మెల్యేను మండల పరిషత్‌ కార్యాలయంలోకి తీసుకెళ్తున్న పోలీసులు

దొనకొండ, న్యూస్‌టుడే: అధికార అండతో ఇన్నాళ్లూ  దౌర్జన్యాలకు పాల్పడిన వైకాపా నాయకులు ఇప్పుడు కూడా అదే మార్గంలో వెళుతున్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండల పరిషత్‌ సమావేశం వద్ద శుక్రవారం దర్శి వైకాపా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి చేసిన రాద్ధాంతమే ఇందుకు నిదర్శనం. మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే తన తల్లి, ప్రకాశం జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి హాజరయ్యేందకు సిద్ధమయ్యారు. అయితే వారు సమావేశానికి వస్తున్నారని తెలిసి మండల ప్రజలు, తెదేపా నాయకులు నిరసన తెలిపారు. ‘మీరు జడ్పీ ఛైర్‌పర్సన్‌ అయినప్పటి నుంచి గ్రామాల్లో నీటి సమస్యతో అల్లాడిపోయాం. దొనకొండ ప్రాంతానికి కనీసం ట్యాంకర్లతోనైనా తాగునీరు అందించని మీకు ఇక్కడికి వచ్చే అర్హత లేదు’ అని వారు మండిపడ్డారు. మండల పరిషత్‌ కార్యాలయం ముందు తెదేపా నాయకులు, కార్యకర్తలు జడ్పీ ఛైర్‌పర్సన్, ఎమ్మెల్యే గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అయితే తమను ఎవరైనా ప్రశ్నిస్తారని ముందుగానే భావించిన ఎమ్మెల్యే బలప్రదర్శనగా తమ వెంట సుమారు 300 మంది వైకాపా నాయకులు, కార్యకర్తలను తీసుకొచ్చారు. దీనిపై తెదేపా నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దర్శి, తాళ్లూరు మండలాల నుంచి కొంత మంది వైకాపా రౌడీలను ఇక్కడికి తీసుకొచ్చి తెదేపా వారిమీద దౌర్జన్యం చేయించేందుకే ఎమ్మెల్యే వచ్చారని, వారు సమావేశం లోపలికి వెళ్తే తమ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు భద్రత ఉండదని అంటూ వారిని గేటు వద్దే గంటసేపు తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు జడ్పీ ఛైర్‌పర్సన్, ఎమ్మెల్యేను తప్ప లోపలికి ఎవరినీ రానివ్వమని చెప్పి, పోలీసు భద్రత మధ్య వారిద్దరినీ ఎంపీడీవో కార్యాలయంలోపలికి పంపించారు. అప్పటికే సమావేశం నుంచి అందరూ వెళ్లిపోవడంతో కాసేపు ఉండి ఎమ్మెల్యే, ఆయన తల్లి ఇద్దరూ వెనుదిరిగారు.

తిరుమలలో కొనసాగుతున్న విజిలెన్స్‌ తనిఖీలు

తిరుమల, న్యూస్‌టుడే: రాష్ట్ర విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆధ్వర్యంలో తిరుమలలోని తితిదే కార్యాలయాల్లో విచారణ కొన్ని రోజులుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం కూడా తితిదే జేఈవో కార్యాలయం, ఇంజినీరింగ్‌ విభాగం, మార్కెటింగ్‌ విభాగంతోపాటు మరిన్ని విభాగాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. వైకాపా హయాంలో మంత్రులు, వారి అనుచరులు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు అక్రమంగా పొందడంపై వచ్చిన ఫిర్యాదులు, శ్రీవాణి టికెట్ల నిధుల లావాదేవీలపై విచారణ చేపట్టారు. తితిదే ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు, నిధుల కేటాయింపు, వినియోగం, కాంట్రాక్టర్ల వివరాలను సేకరించారు. వీటికి సంబంధించి ఆయా విభాగాల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిరంతరాయంగా ఈ తనిఖీలు కొనసాగుతాయని విజిలెన్స్‌ ఉన్నతాధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని