BJP: అమిత్‌ షాతో ఈటల భేటీ... తెలంగాణలో భాజపా కొత్త వ్యూహమేంటి?

తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న భాజపా నాయకత్వం ఆ దిశగా ఒక్కో అడుగు ముందుకెళ్తోంది.

Published : 20 Jun 2022 02:10 IST

హైదరాబాద్‌: తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న భాజపా నాయకత్వం ఆ దిశగా ఒక్కో అడుగు ముందుకెళ్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనేతలంతా తెలంగాణపై దృష్టిసారించారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ప్రత్యేకంగా దిల్లీకి పిలిపించుకొని భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈటలను హుటాహుటిన దిల్లీకి ఎందుకు పిలిచారు? కొత్తగా ఏమైనా బాధ్యతలు అప్పగించబోతున్నారా? కొత్తగా ప్రణాళిక ఏమైనా ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈటలకు జాతీయ స్థాయిలో కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశముందని, అందుకే దిల్లీకి రమ్మన్నారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వచ్చే నెలలో హైదరాబాద్‌లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈలోపే ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తర్వలో జాతీయ పార్టీని ప్రకటించేందుకు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెసేతర, భాజపాయేతర నాయకులతో భేటీ అవుతూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. అటు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ట్విటర్‌ వేదికగా తరచూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా తెరాస నాయకులు భాజపాను టార్గెట్‌ చేశారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన ‘అగ్నిపథ్‌’ అల్లర్లు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బహిరంగంగానే విమర్శలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం వేడెక్కిన నేపథ్యంలో హుటాహుటిన హోంమంత్రి అమిత్‌ షా.. ఈటలతో ప్రత్యేకంగా భేటీ కావడం కొత్త చర్చకు తెరలేపింది. భవిష్యత్‌లో భాజపా ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందో వేచి చూడాలి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని