Ganta Srinivasa Rao: ప్రజాధనంతో జగన్‌ విలాస సౌధం

రుషికొండపై పర్యాటక రిసార్టును ధ్వంసం చేసి ప్రజాధనంతో జగన్‌ విలాసవంతమైన రాజమహల్‌ నిర్మించారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇటువైపు ఎవరినీ అనుమతించలేదు.

Updated : 17 Jun 2024 06:42 IST

రూ.వందల కోట్లతో రుషికొండలో రహస్య రాజమహల్‌
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధ్వజం
కూటమి నేతలతో కలిసి నిర్మాణాల పరిశీలన

రుషికొండపై భవనాలను పరిశీలిస్తున్న భీమిలి తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు

ఈనాడు, విశాఖపట్నం, పీఎంపాలెం, న్యూస్‌టుడే: రుషికొండపై పర్యాటక రిసార్టును ధ్వంసం చేసి ప్రజాధనంతో జగన్‌ విలాసవంతమైన రాజమహల్‌ నిర్మించారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇటువైపు ఎవరినీ అనుమతించలేదు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో... రుషికొండపై నిర్మాణాలను మొదటిసారి మీడియా సమక్షంలో ఆదివారం తెదేపా, జనసేన, భాజపా నాయకులతో కలిసి గంటా పరిశీలించారు. భవన సముదాయ ప్రాంగణాన్ని, అక్కడే ఉన్న పార్కును సందర్శించి, సముద్రం అభిముఖంగా ఉన్న నిర్మాణాల తీరు, ఇక్కడి భవనాల్లోని అన్ని గదులు, వినియోగించిన సామగ్రిని పరిశీలించారు. సువిశాలంగా నిర్మించిన మరుగుదొడ్లు, బాత్‌టబ్, పడక గదులను చూసి నాయకులు నివ్వెరపోయారు. కళింగ బ్లాకులోని రెండు భవనాలు, భారీ సమావేశ మందిరాలు, బ్లాకులు, షాండ్లియర్లను పరిశీలించారు. అనంతరం గంటా శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడారు. ‘నాటి ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ తదితరులు ఇక్కడి నిర్మాణాలను చూసేందుకు వస్తే అనుమతించలేదు. ప్రజావేదిక కూల్చివేతతో ఆరంభమైన జగన్‌ విధ్వంసకర పాలన ఐదేళ్లు కొనసాగింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు విశాఖ వచ్చేస్తున్నామంటూ వివిధ పండుగల పేర్లు చెప్పి వాయిదాలు వేశారు. చివరికి జగన్‌ రాకుండానే పదవీకాలం ముగిసిపోయింది. జగన్‌ విశాఖలో ఉండాలన్న ఆకాంక్షతో కనువిందు చేసే పర్యాటక ప్రాజెక్టును దెబ్బతీశారు’ అని గంటా ధ్వజమెత్తారు.

హెలికాప్టర్‌లో నుంచే చూశారు

‘ప్రభుత్వం ఏదైనా కట్టడం చేపడితే దాని ఖర్చు, విస్తీర్ణం, వసతుల కల్పన వంటి వివరాలను వెల్లడిస్తుంది. దానికి భిన్నంగా దేశంలో ఎక్కడాలేని విధంగా అత్యంత గోప్యంగా ఈ భవనాలు నిర్మించారు. లాభాల్లో నడుస్తున్న పర్యాటక రిసార్టును ధ్వసం చేసి మరో నిర్మాణం ఎందుకు చేపట్టారో చెప్పలేదు. ముందు పర్యాటక ప్రాజెక్టు, ఆపై ముఖ్యమంత్రి అతిథిగృహం, తరువాత స్టార్‌ హోటల్‌ అన్నారు. అనుమతి లేదని, చట్ట విరుద్ధమని ప్రజావేదికను కూల్చేసిన జగన్‌... రుషికొండలో రాజమహల్‌కు అనుమతులు ఎలా వచ్చాయో చెప్పాలి. రూ.500 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన భవనాలను రహస్యంగా పర్యాటక మంత్రితో ప్రారంభోత్సవం చేయించారు. ఈ భవానాల్లో వాడిన మార్బుల్స్, శానిటరీ సామగ్రి, విద్యుత్తు పరికరాలు, ఫర్నిచర్, ద్వారాలు ఎంతో ఖరీదైనవి. జగన్‌ కలల సౌధాన్ని నిర్మించుకున్నా ఒక్కసారి కూడా వచ్చి చూడలేదు. హెలికాప్టర్‌పై కొండచుట్టూ తిరిగి చూసుకున్నారు’ అని గంటా ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని