YSRCP: ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్టు నిరూపిస్తా: వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి

ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్టు సాక్ష్యాలతో సహా బుధవారం మీడియా ముందుకు వస్తానని వైకాపా నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

Updated : 31 Jan 2023 22:06 IST

నెల్లూరు: ఫోన్‌ ట్యాపింగ్‌ జరగలేదని, ఆధారాలు ఉంటే చూపాలన్న మాజీమంత్రి బాలినేని వ్యాఖ్యలపై వైకాపా నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పందించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్టు బుధవారం నిరూపిస్తానని తెలిపారు. ‘‘సాక్ష్యాలతో సహా రేపు మీడియా ముందుకు వస్తా. ఫోన్‌ ట్యాపింగ్‌ బయటపడితే ఇద్దరు ఐపీఎస్‌ల ఉద్యోగాలు పోతాయి. ఇద్దరి ఉద్యోగాలు పోతాయనే ఇప్పటి వరకు బయటపెట్టలేదు. ఇప్పుడు సాక్ష్యాలు బయటపెట్టక తప్పడం లేదు. వైకాపాలో అసంతృప్తులపై ఫోన్‌ ట్యాపింగ్‌ అందరికీ తెలియాలి’’ అని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందనేది అవాస్తవం: బాలినేని

వైకాపా అసంతృప్త నేతలతో చర్చలు జరిపేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం నెల్లూరు వచ్చారు. ఎమ్మెల్యే కోటంరెడ్డితో చర్చలు జరిపేందుకు బాలినేని ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆయన నిరాశతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా బాలినేని మీడియాతో మాట్లాడుతూ..‘‘ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందనేది అవాస్తవం. తెదేపాలోకి వెళ్లానుకున్న వాళ్లే ఇలాంటివి చెబుతారు. వైకాపాకు నష్టం చేసి తెదేపాలోకి వెళ్లాలని చూస్తున్నారు. కోటంరెడ్డితో మాట్లాడిన వ్యక్తే కాల్‌ రికార్డు చేశారు. కాల్‌ రికార్డును ఫోన్‌ ట్యాపింగ్‌ అంటారా? కోటంరెడ్డి స్నేహితుడే కాల్‌ రికార్డు చేసి లీక్‌ చేశారు. అన్నదమ్ముల మధ్య మేం ఎలాంటి చిచ్చు పెట్టలేదు. మంత్రి పదవి జిల్లాకు ఒకరికే దక్కుతుంది. ఐదారుసార్లు గెలిచిన వారికి కూడా మంత్రి పదవి దక్కలేదు. పదవులు దక్కకుంటే పార్టీపై నిందలు వేస్తారా? మా పార్టీలో తెదేపా నాయకులకు సీట్లు ఖాళీగా లేవు’’ అని బాలినేని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు