MLA Rajasingh: పాతబస్తీ అభివృద్ధి కోసం పోరాటం చేసేది భాజపానే: రాజాసింగ్‌

పాతబస్తీకి మెట్రో రైలు లైన్‌ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రశ్నించారు. గతంలో పాతబస్తీకి మెట్రో రూట్‌ సిద్ధమైందని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ చెప్పారని.. వెంటనే నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు.

Updated : 24 Dec 2022 15:10 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీకి మెట్రో రైలు లైన్‌ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. మెట్రో లైన్‌ కోసం భాజపా దీక్ష చేస్తే పోలీసులు అరెస్టు చేశారని మండిపడ్డారు. భాజపా డిమాండ్‌లో ఏమైనా తప్పు ఉందా అని కేసీఆర్‌, కేటీఆర్‌ను ఈ సందర్భంగా ప్రశ్నించారు. ‘‘గతంలో అసెంబ్లీ సాక్షిగా పాతబస్తీ ఎందుకు అభివృద్ది జరగడం లేదు.. మెట్రోను ఎందుకు తీసుకువెళ్లడంలేదని నిలదీశాం. అప్పుడు పాతబస్తీకి మెట్రోకి రూట్‌మ్యాప్‌ సిద్ధమైందని.. నిధులు మంజూరయ్యాయని చెప్పారు. వెంటనే నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తామని మాట ఇచ్చారు. ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతుంది తప్పితే ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ సైతం అసెంబ్లీలో మెట్రో కావాలని అడిగి.. సీఎం ఛాంబర్‌కు వెళ్లి పాతబస్తీకి మెట్రో వద్దని అంటారు. పాతబస్తీ అభివృద్ధి చెందితే రాజకీయ భవిష్యత్ ఉండదనే భావనతోనే అక్కడ ఎలాంటి పనులు చేపట్టట్లేదు. పాతబస్తీ ప్రజలకు చెప్పేది ఒక్కటే మీకోసం పోరాటం చేసేది భాజపా మాత్రమే. పాతబస్తీ అభివృద్ధి చెందాలంటే భాజపాకి మద్దతు ఇవ్వాలి’’ అని రాజాసింగ్‌ విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని