Gujarat Assembly Polls: బిల్కిస్‌ బానో దోషులను వెనకేసుకొచ్చిన ఎమ్మెల్యేకి మళ్లీ సీటు

బిల్కిస్‌ బానోస్‌ అత్యాచార దోషులను విడుదలకు మద్దతిచ్చిన భాజపా ఎమ్మెల్యే చంద్రసిన్హ్‌ రౌల్‌జీకి భాజపా మరోసారి టికెట్‌ కేటాయించింది. అది కూడా బిల్కిస్‌ బానోపై అత్యాచారం జరిగిన గోద్రా నియోజకవర్గం నుంచే కావడం గమనార్హం.

Published : 12 Nov 2022 02:02 IST

అహ్మదాబాద్‌: బిల్కిస్‌ బానోస్‌ అత్యాచార దోషులను విడుదలకు మద్దతిచ్చిన భాజపా ఎమ్మెల్యే చంద్రసిన్హ్‌ రౌల్‌జీకి భాజపా మరోసారి టికెట్‌ కేటాయించింది. అది కూడా బిల్కిస్‌ బానోపై అత్యాచారం జరిగిన గోద్రా నియోజకవర్గం నుంచే కావడం గమనార్హం. ఆగస్టు 15న బిల్కిస్‌ బానో దోషులను గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారిని చంద్రసిన్హ్‌ ‘సంస్కారీ బ్రాహ్మణులు’గా అభివర్ణించడం చర్చనీయాంశమైంది. చంద్రసిన్హ్‌ రౌల్‌జీ 2017 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. 2007, 2012లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిపై కేవలం 258 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

దోషుల విడుదల అంశాన్ని పరిశీలించాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు బిల్కిన్‌ బానో అత్యాచార నిందితులను విడుదలకు గుజరాత్‌ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అందులో చంద్రసిన్హ్‌ కూడా సభ్యుడిగా ఉన్నారు. 11 మంది దోషులను విడుదల చేయాలని ఈ కమిటీ ఏకపక్షంగా తీర్మానించింది. అనంతరం ఓ ఇంటర్వ్యూలో చంద్రసిన్హ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘‘ వారంతా బ్రాహ్మణులు... అంటే సంస్కారవంతులు. ఉద్దేశ పూర్వకంగానే వాళ్లని ఈ కేసులో ఇరికించి శిక్షపడేలా చేశారు’’ అని చంద్రసిన్హ్‌ వ్యాఖ్యానించారు. జైల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ల నడవడిక సక్రమంగానే ఉందని అందుకే విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.

2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు ప్రత్యేక సీబీఐ కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. కాగా దోషులుగా వారు 15ఏళ్లు కారాగారంలో గడిపారు. ఆగస్టు 15న వారిని గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని