Updated : 16 Mar 2021 19:26 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.. ఆ ఓట్ల లెక్కే వేరప్పా! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా సాగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల సమరం ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో ఈ నెల 14న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లను బుధవారం లెక్కించనున్నారు. ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం, గట్టి పోటీనిచ్చే స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలవడంతో రసవత్తర పోరు కొనసాగిన విషయం తెలిసిందే. దీనికితోడు ఈ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి- హైదరాబాద్‌ నియోజకవర్గం నుంచి 93మంది, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నుంచి 71మంది అభ్యర్థులు బరిలో నిలవడం ఒక రికార్డయితే.. ఓటర్లు సైతం అదే స్థాయిలో పోటెత్తడం మరో రికార్డు. దీంతో బుధవారం చేపట్టనున్న ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానంలోనే కాదు.. ఓట్ల లెక్కింపు విధానంలోనూ ఎంతో విభిన్నత కనబడుతుంది. 

సాధారణ ఎన్నికల్లో అయితే ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజేతగా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. ప్రాధాన్యతా ఓట్ల విధానంలో ఫలితాలు ఎప్పుడు, ఎటు మారతాయో చెప్పడం కష్టం. పోలైన ఓట్లలో 50శాతం + ఒక ఓటు అధికంగా వచ్చేదాకా లెక్కింపు కొనసాగిస్తారు. ఆ తర్వాతే విజేతను ప్రకటిస్తారు. ఈసారి రెండు నియోజకవర్గాల్లోనూ మూడున్నర లక్షలకు పైగా చొప్పున ఓట్లు పోలవ్వడంతో లెక్కింపు ప్రక్రియ అధికారులకు ఓ పెద్ద సవాల్‌గా మారింది. అంతేకాదు.. జంబో బ్యాలెట్‌ పత్రాలతో కౌంటింగ్‌కు ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేం.

లెక్కింపు ప్రక్రియ సాగుతుందిలా..

ప్రాధాన్య క్రమంలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో లెక్కింపు కూడా అదే ప్రాతిపదికన చేపడతారు. తొలి ప్రాధాన్య ఓటు ఎవరికీ పడని పక్షంలో ఆ ఓటు చెల్లనిదిగా పరిగణిస్తారు. ప్రాధాన్య ఓటింగ్‌ విధానంలో విజేత కావడానికి కోటాను నిర్ణయిస్తారు. చెల్లుబాటైన ఓట్లలో 50శాతం కన్నా ఒక ఓటు ఎక్కువగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. (ఉదాహరణకు 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారనుకుందాం. ఆ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 450000 కాగా.. పోలైనవి 420000, చెల్లినవి 380000 అనుకుంటే.. విజేతకు కావాల్సిన కనీస ఓట్లు 1,90,001 అన్నమాట)

చెల్లిన ఓట్లలో మొత్తం 20 మంది అభ్యర్థుల్లో ఎవరికెన్ని వచ్చాయో చూస్తారు. తొలి రౌండ్‌లోనే ఎవరికైనా 1,90,001 ఓట్లు (కోటా ఓట్లు) వస్తే గనక అతడిని విజేతగా ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్యతా ఓట్లలో ఎవరికీ 50 శాతం కన్నా ఒక ఓటు ఎక్కువ రాకపోతే అప్పుడు ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపడతారు. అప్పుడు రెండో రౌండ్ లెక్కింపు‌ మొదలవుతుంది. ఈ ప్రక్రియలో తొలి ప్రాధాన్య ఓట్లు తక్కువ వచ్చిన అభ్యర్థిని తొలుత ఎలిమినేట్‌ చేస్తారు. ఆ అభ్యర్థికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్య ఓటు ఎవరికి వేశారో గుర్తించి ఆయా అభ్యర్థులకు ఆ ఓట్లను బదలాయిస్తారు.

రెండో రౌండ్‌లో ఎవరికి 50 శాతం కంటే ఒక ఓటు ఎక్కువ వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. అప్పటికీ ఫలితం తేలకపోతే మొదటి ప్రాధాన్య ఓట్లు తక్కువగా వచ్చిన రెండో అభ్యర్థిని తొలగిస్తారు. అతడి బ్యాలెట్‌ పత్రంలో ఇతర అభ్యర్థులకు వచ్చిన రెండో ప్రాధాన్య ఓట్లను, మొదట తొలగించిన అభ్యర్థికి వచ్చిన మూడో ప్రాధాన్య ఓట్లను ఆయా అభ్యర్థుల ఓట్లలో కలుపుతారు. అలా 50శాతం+ 1 ఓటు వచ్చే వరకు అభ్యర్థులను తొలగిస్తూ లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తారు. లేదంటే ఒక అభ్యర్థి మిగిలే వరకు ఈ లెక్కింపు కొనసాగుతుంది. ఈసారి భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచిన నేపథ్యంలో లెక్కింపునకు ఎంత సమయం పడుతుందో చూడాలి.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని