Jeevan Reddy: కేసీ వేణుగోపాల్‌తో భేటీ.. మనసు మార్చుకున్న జీవన్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దిల్లీలో ఈరోజు పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆయన   తన మనసు మార్చుకున్నారు.

Published : 26 Jun 2024 23:29 IST

హైదరాబాద్‌: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై మూడు రోజులుగా అలకబూనిన సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దిల్లీలో పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆయన తన మనసు మార్చుకున్నారు. పార్టీ కీలక నేతలు ఆయనతో మాట్లాడి సముదాయించడంతో వెనక్కు తగ్గారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడారు. తనకు పార్టీనే ముఖ్యమని వెల్లడించారు. రాజకీయ పరిణామాలు, పరిస్థితుల వల్ల కొన్ని నిర్ణయాలు తప్పవన్నారు. మొదటి నుంచి ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని పార్టీ ముఖ్యులు చెప్పారన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడం చాలా ముఖ్యమని, ఏ పార్టీకైనా వారే కీలకమని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ అమలు చేస్తోందని.. భారాస ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ పార్టీలో చేరికలకు డోర్లు తెరిచే ఉన్నాయని పార్టీ తెలంగాణ వ్యవహారాల బాధ్యులు దీపాదాస్‌ మున్షీ అన్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యత తగ్గకుండా చూస్తామని తెలిపారు. పీసీసీ పదవీకాలం ముగింపు అంటూ ఏమీ లేదని, దీనిపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. జీవన్‌రెడ్డి పార్టీలో సీనియర్‌ నేత అని, ఆయనను కించపరచడం తమ ఉద్దేశం కాదన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే చేరిక వల్ల అమర్యాద, అగౌరవంగా ఆయన భావించారని దీపాదాస్‌ అన్నారు. పార్టీ ఫిరాయింపులపై భారాస నేతల వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. భారాస అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ అంతానికి యత్నించినట్లు ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరిస్తోందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని