MLC Kavitha: మావైపు సత్యం, న్యాయం.. ఏ విచారణ నైనా ధైర్యంగా ఎదుర్కొంటాం: ఎమ్మెల్సీ కవిత

భాజపాను ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడి చేయిస్తున్నారని భారాస ఎమ్మెల్సీ, భారత్‌ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

Updated : 09 Mar 2023 15:09 IST

దిల్లీ: భాజపాను ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడి చేయిస్తున్నారని భారాస ఎమ్మెల్సీ, భారత్‌ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తమ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీలతో దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు ఈడీ ఇచ్చిన నోటీసులు, మహిళా బిల్లుపై భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టనున్న దీక్ష తదితర అంశాలపై ఆమె మాట్లాడారు. 

‘‘గత 27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా దానికి మాత్రం ఆమోదం లభించలేదు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఈ బిల్లు కోసం మా పోరాటం కొనసాగిస్తాం. 2014, 2019 ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై భాజపా హామీ ఇచ్చింది. ప్రజలు 300కి పైగా స్థానాలు ఆ పార్టీకి ఇచ్చినా బిల్లును ఆమోదించలేదు. నోరు విప్పకుండా ఈ అంశాన్ని కోల్డ్‌ స్టోరేజీలో పెట్టారు. ఈనెల 10న మహిళా బిల్లుపై దిల్లీలో దీక్ష చేస్తామని మార్చి 2న ప్రకటన విడుదల చేశాం. మా దీక్షకు మద్దతిస్తూ విపక్షాలు కూడా ముందుకొచ్చాయి. 

మార్చి 10న దీక్ష చేపడతామని అనగానే మార్చి 9న విచారణకు రావాలని ఈడీ సమన్లు ఇచ్చింది. ధర్నాకు సంబంధించి ముందస్తు కార్యక్రమాల కారణంగా 11న విచారణకు వస్తానని చెప్పా. అలా చెప్పినా 9నే రావాలని ఈడీ నోటీసు ఇచ్చింది. మహిళలను ఇంటికొచ్చి విచారించాలని చట్టం చెబుతోంది. దానికి విరుద్ధంగా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. మా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలతో బెదిరింపులకు పాల్పడుతోంది. ఈడీ విచారణకు మనస్ఫూర్తిగా సహకరిస్తా. నవంబర్‌, డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలు రావొచ్చు. ఎన్నికలకు ముందు దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం భాజపా విధానం. ఎన్నికల నేపథ్యంలో మా పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేయడమే ఆ పార్టీ లక్ష్యం. మా వైపు సత్యం, ధర్మం, న్యాయం ఉన్నాయి. ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటాం’’ అని కవిత అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని