Kavitha: భాజపా నేతలు చెబితే అరెస్టు చేస్తారా?: ఎమ్మెల్సీ కవిత

దిల్లీ మద్యం కేసులో తదుపరి అరెస్టు కవితేనన్న భాజపా నేతల వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో మర్యాదపూర్వకమైనవి కాదు అని భారాసకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

Updated : 03 Mar 2023 09:18 IST

అప్పుడిక దర్యాప్తు సంస్థలు ఎందుకు?
10న దిల్లీలో మహిళా రిజర్వేషన్‌పై నిరాహార దీక్ష

ఈనాడు- హైదరాబాద్‌: దిల్లీ మద్యం కేసులో తదుపరి అరెస్టు కవితేనన్న భాజపా నేతల వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో మర్యాదపూర్వకమైనవి కాదు అని భారాసకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ‘‘అరెస్టుల విషయాన్ని దర్యాప్తు సంస్థలు చెప్పాలి గానీ.. భాజపా చెబితే ఎలా? ఆ పార్టీ నేతలు చెబితే అరెస్టు చేస్తారా? దానికిక దర్యాప్తు సంస్థలెందుకు?’’ అని ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మద్యం కేసులో నా అరెస్టుపై భాజపా నాయకులు ఊహాగానాలు చేయడం దర్యాప్తు సంస్థల విచారణను ప్రభావితం చేస్తున్నారనడానికి నిదర్శనమన్నారు. దర్యాప్తు సంస్థలతో భాజపా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుందన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు మరోసారి బయటపెట్టుకుంటున్నారని విమర్శించారు.

బిల్లును ఎందుకు ఆమోదించరు?

మహిళా రిజర్వేషన్‌ సాధన కోసం భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 10న దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరాహార దీక్ష చేపడుతున్నట్లు కవిత తెలిపారు. భారత్‌ జాగృతి సభ్యులతో కలిసి దీక్షకు సంబంధించిన పోస్టర్లను కవిత ఆవిష్కరించి మాట్లాడారు. ‘‘ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం మహిళా రిజర్వేషన్‌ బిల్లును భాజపా ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తీసుకురావాలి. మూడు నల్ల రైతు చట్టాలను పార్లమెంటులో ఆమోదించగలిగిన భాజపా ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదు? ఓబీసీ జనగణన కూడా చేపట్టాలి’’ అని కవిత డిమాండ్‌ చేశారు.

అదానీపై విచారణ చేపట్టరా..?

‘‘దిల్లీ మద్యం కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మా దీక్ష అని భాజపా నేతలు అనడం సరికాదు. అలా అయితే, అదానీ కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే భాజపా ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచిందని మేము అనాలా? ప్రతిపక్ష పార్టీల నేతల మీద కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అదానీ కుంభకోణంపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు? ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. భాజపాను గద్దె దించాలనుకుంటే.. కాంగ్రెస్‌ పార్టీ తన రాజకీయ వ్యూహాన్ని ఖరారు చేసుకొని ఇతర పార్టీలతో చర్చించుకోవాలి. ముందస్తు ఎన్నికలపై ప్రగతిభవన్‌లో ఎలాంటి చర్చ జరగడం లేదు’’ అని కవిత పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని