Delhi Liquor Case: కేసీఆర్‌, భారాసను లొంగదీసుకోలేరు: కవిత

దిల్లీ మద్యం కేసులో తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు ఇవ్వడంపై భారాస ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

Updated : 08 Mar 2023 11:46 IST

హైదరాబాద్‌: దిల్లీ మద్యం కేసులో తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు ఇవ్వడంపై భారాస ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రేపు దిల్లీలో విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొందని తెలిపారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని చెప్పారు. 

‘‘ముందస్తు అపాయింట్‌మెంట్ల దృష్ట్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయసలహా తీసుకుంటాను. కేసీఆర్‌, భారాసను లొంగదీసుకోవడం కుదరదని భాజపా తెలుసుకోవాలి. ఈనెల 10న దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉంది. మహిళా బిల్లు కోసం ఒకరోజు నిరాహార దీక్ష తలపెట్టాం. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్నది మా ప్రధానమైన డిమాండ్. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాం. భాజపా వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం. కేంద్రంలోని ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచదు’’ అని కవిత ట్వీట్‌ చేశారు.

దిల్లీ మద్యం కేసులో హైదరాబాద్‌ వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను గురువారం ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో రామచంద్ర పిళ్లై.. కవితకు బినామీ అని ఈడీ మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపిన విషయం తెలిసిందే. ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్‌గ్రూప్‌ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్‌ సంస్థలో  కవిత తరఫున అరుణ్‌ భాగస్వామిగా ఉన్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు