MLC Kavitha: దేశంలోని బొగ్గుగని కార్మికులందర్నీ ఏకం చేయాలి: ఎమ్మెల్సీ కవిత

కోల్‌ ఇండియా కంటే సింగరేణిలో అధిక వేతనాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈమేరకు భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు.

Updated : 22 Jan 2023 16:49 IST

భూపాలపల్లి: సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తే కొందరు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కోల్‌ ఇండియా కంటే సింగరేణిలోనే వేతనాలు అధికమని వివరించారు. భూపాలపల్లిలో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో భారాస, జాగృతి కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కవిత మాట్లాడుతూ.. ‘‘సింగరేణి సంస్థలో ఉన్న ఉద్యోగాలను కేవలం 20వేలకు కుదించాలని.. సంస్థను నిర్వీర్యం చేయాలని ఆనాడు భావించారు. ఆ తర్వాత ప్రైవేటీకరణ చేయాలనే కుట్రకు తెరలేపారు. కానీ, ఇవాళ దాన్ని మనం తిప్పికొట్టి కార్మికులందర్నీ కాపాడుకున్నాం. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లకో రిటైరయ్యే వాళ్లందర్నీ చేరదీశాం. వాళ్ల పిల్లలందరికీ దాదాపు 18వేల మందికి ఉద్యోగాలిచ్చాం. అంటే ఈ 18వేల మందితో ఇంకా 30ఏళ్లు సింగరేణికి ఢోకా లేకుండా చేశామని ఘంటాపథంగా చెప్పుకోవాలి. డిపెండెంట్‌ ఉద్యోగాల్లో జాయిన్‌ అయిన ప్రతి ఒక్క యువ మిత్రుడికి విజ్ఞప్తి చేస్తున్నా.. డిపెండెంట్‌ ఉద్యోగాలు ఇస్తామంటే కోర్టుకు వెళ్లి ఆపాలనుకునేవాళ్లు ఎవరనేది ప్రజలకు తెలియజేయాలి. సింగరేణి సౌకర్యాల మాదిరిగా దేశమంతా ఉండాలి. దేశంలోని బొగ్గుగని కార్మికులందర్నీ ఏకం చేయాలి’’ అని కవిత పిలుపునిచ్చారు.

భారాసలో భగ్గుమన్న విభేదాలు..

భూపాలపల్లిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కొత్త భవనం ప్రారంభోత్సవంలో భారాసలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం భవనంలో శిలాఫలకంలో మధుసూదనాచారి పేరు లేదని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గండ్ర వెంకటరమణారెడ్డి భారాసలో వర్గ విభేదాలు సృష్టించే కుట్ర చేస్తున్నారని వారు ఆరోపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని