Kavitha: ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకే వెళ్దాం.. విశ్రాంతి ప్రసక్తే లేదు: ఎమ్మెల్సీ కవిత

దేశంలో అనేక అంశాల పట్ల ప్రజలను జాగృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఏడాదిన్నర ఉందని.. ఈలోగా సత్తా చూపించాల్సిన అవసరం ఉందన్నారు.

Updated : 12 Dec 2022 18:27 IST

హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను భాజపా కూల్చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మొత్తం 8 రాష్ట్రాల ప్రభుత్వాలను భాజపా కూల్చేసిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశంలో అనేక అంశాల పట్ల ప్రజలను జాగృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘రూపాయి విలువ సహా అన్ని రంగాలు తిరోగమన దిశలో ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగితేనే అది మనల్ని కాపాడుతుంది. తెలంగాణ తరహాలోనే దేశంలో కొత్త ఉద్యమాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎవరు ప్రశ్నించినా ఏజెన్సీలతో దాడులు చేయిస్తున్నారు. కేంద్రం వైఫల్యాలను ఎత్తిచూపిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. గొంతెత్తే ప్రతిపక్ష నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకే వెళ్తాం. ఈ పోరాటంలో విశ్రాంతి తీసుకునే ప్రసక్తే లేదు. కవులు, కళాకారులు, రచయితలు.. తమ కలానికి, గళానికి పదును పెట్టాలి. దేశంలో తెలంగాణను బలమైన శక్తిగా నిలుపుదాం. ఎన్నికలకు ఏడాదిన్నర ఉంది. ఈలోగా మన సత్తా చూపిద్దాం. వ్యవస్థలతో దాడులు చేయిస్తూ మన సమయం వృథా చేస్తున్నారు. మిగతా సమయాన్ని మన సత్తా చాటేందుకు ఉపయోగిద్దాం’’ అని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని