MLC Kavitha: ప్రగతిభవన్‌కు ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ నోటీసులపై కేసీఆర్‌తో చర్చ!

తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రగతి భవన్‌కు వెళ్లారు. దిల్లీ మద్యం కేసులో నోటీసులు అందుకున్న అనంతరం కవిత ప్రగతి భవన్‌కు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనాయాంశమైంది. 

Published : 03 Dec 2022 11:58 IST

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రగతి భవన్‌కు వెళ్లారు. దిల్లీ మద్యం కేసులో సీబీఐ శుక్రవారం కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దిల్లీలో నమోదుచేసిన ఆర్‌సీ 53(ఎ)/2022 కేసులో దర్యాప్తు కోసం సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద దిల్లీకి చెందిన సీబీఐ అవినీతి నిరోధక విభాగం డీఎస్పీ అలోక్‌ కుమార్‌ షాహి ఈ నోటీసులు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోకానీ, దిల్లీలో కానీ కవిత నివాసంలో విచారించాలని అనుకుంటున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు.

సీబీఐ నోటీసులు జారీ అయిన విషయాన్ని కవిత ధ్రువీకరించారు. ‘‘నా వివరణ కోరుతూ సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద సీబీఐ నోటీసులు జారీ చేసింది. వారి అభ్యర్థన మేరకు ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని మా నివాసంలో కలుసుకోవచ్చని అధికారులకు తెలియజేశా. ఇంటివద్దే వారికి వివరణ ఇస్తా’’ అని కవిత శుక్రవారం రాత్రి విలేకరులకు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత ప్రగతి భవన్‌కు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ అంశంపై కవిత ఇప్పటికే న్యాయనిపుణులతో చర్చించినట్లు తెలుస్తోంది. సీబీఐ నోటీసులు, ఈ వ్యవహారంలో న్యాయపరంగా, రాజకీయ పరంగా ఏం చేయాలి.. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కేసీఆర్‌తో చర్చించేందుకు అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు కవితకు సంఘీభావంగా ఆమె నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని