Published : 23 Jul 2021 01:21 IST

Mamata Banerjee: మోదీ టైం ఇచ్చారు.. దిల్లీ వెళ్లి కలుస్తా!

కోల్‌కతా: వచ్చే వారం దిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నట్టు పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. కోల్‌కతాలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘రెండు, మూడు రోజులు దిల్లీ పర్యటనకు వెళ్తున్నా. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సమయం ఇస్తే ఆయన్ను కలుస్తా. ప్రధాని నరేంద్ర మోదీ నాకు సమయం ఇచ్చారు. ఆయనతో సమావేశమవుతా’ అని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అపూర్వ విజయం సాధించిన తర్వాత మమత దిల్లీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఆమె ఈ నెల 28న మోదీని కలవనున్నట్టు సమాచారం. 

మరోవైపు, మమత దిల్లీ పర్యటన అంశం జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మే నెలలో జరిగిన ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఘన విజయం అందించిన దీదీ.. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో హస్తినకు వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఆమె దిల్లీ పర్యటనలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తదితర కీలక నేతలతోనూ భేటీ అవుతారని సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికలకు భాజపాకు వ్యతిరేకంగా విపక్షాలు ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ జాతీయ రాజకీయాల్లో దీదీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్న విశ్లేషణలూ వినబడుతున్నాయి.

పెగాసస్‌.. వాటర్‌ గేట్‌ స్కాం కన్నా పెద్దది!

దేశంలో కలకలం రేపుతున్న పెగాసస్‌ వ్యవహారంపై వరుసగా రెండో రోజూ కేంద్రంపై దీదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 1972లో అమెరికాలో జరిగిన వాటర్‌ గేట్‌ కుంభకోణం కన్నా పెగాసస్‌ స్కాం పెద్దదని వ్యాఖ్యానించారు. ఫోన్‌ల ట్యాపింగ్‌, మీడియా సంస్థలపై ఐటీ దాడులను చూస్తుంటే దేశం సూపర్‌ ఎమర్జెన్సీలో ఉన్నట్టుగా అనిపిస్తోందన్నారు. మీడియా సంస్థలు, పాత్రికేయులపై ఐటీ దాడులను ఖండిస్తున్నట్టు చెప్పారు. గురువారం ఆమె కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ..  ఓ వైపు ఏకపక్ష దాడులు, మరోవైపు పెగాసస్ వ్యవహారం ప్రమాదకరంగా మారాయన్నారు.  నిష్పాక్షిక సంస్థలన్నీ భాజపా హయాంలో రాజకీయమయమైపోయాయని విమర్శించారు. భాజపా నాయకత్వం తన సొంత మంత్రులు, అధికారులనే నమ్మడంలేదని దీదీ ఆరోపించారు. 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని