Gujarat Polls 2022: గుజరాత్‌ ఎన్నికలు.. మోదీ సరికొత్త నినాదం

గుజరాత్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ సరికొత్త  నినాదాన్ని అందుకున్నారు.‘‘ గుజరాత్‌ను నేనే తయారు చేశాను’’ అనే భావన ప్రతి ఒక్కరిలోనూ రావాలన్నారు. 

Published : 07 Nov 2022 01:52 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ సరికొత్త నినాదాన్ని అందుకున్నారు. ‘‘గుజరాత్‌ను నేనే తయారు చేశాను’’ అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని అన్నారు. ‘‘ ప్రతి గుజరాత్‌ పౌరుడు గుండెల నిండా ఆత్మవిస్వాంతో ఉంటారు. అందుకే వాళ్లు మాట్లాడిన ప్రతి మాట గుండె లోతుల్లోంచి వస్తుంది. ‘నేను ఈ గుజరాత్‌ను తయారు చేశాను’.. అనే మాట ప్రతి ఒక్కరిమనస్సులో నాటుకుపోవాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కాప్రద జిల్లాలోని ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ రాష్ట్రాన్ని అభాసుపాల్జేస్తోందంటూ పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. గత 20 సంవత్సరాలుగా రాష్ట్ర పరువు తీసేందుకు యత్నిస్తున్న విభజన శక్తులకు గుజరాత్‌ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మోదీ వ్యాఖ్యానించారు. ఆదివాసీల అభివృద్ధికి భాజపా కృషి చేస్తోందని అన్నారు.

మరోవైపు, ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకాక ముందు నుంచే అధికార భాజపా ఎన్నికల ప్రచారాన్ని విస్త్రృతం చేసింది. అక్టోబరు 13న అహ్మదాబాద్‌లో హోంమంత్రి అమిత్‌షా ‘ గుజరాత్‌ గౌరవ యాత్ర’ పేరిట ప్రచారం ప్రారంభించారు. ఆ తర్వాతి రోజునే  పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మెహ్‌సనాలో యాత్ర మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తోపాటు పలువురు నాయకులు కూడా భాగమవుతున్నారు. భాజపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతోంది. గుజరాత్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబరు 1, 5 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించి, డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని