UP Election 2022: విపక్షాలు టీకాల గురించి కూడా తప్పుడు ప్రచారం చేశాయి..!

అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ.. నేతల ఆరోపణలు మరింత పదును తేలుతున్నాయి. శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో వర్చువల్‌ ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ.. సమాజ్‌వాదీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Published : 05 Feb 2022 02:32 IST

యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ విమర్శలు

లఖ్‌నవూ: అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతోన్న కొద్దీ.. నేతల ఆరోపణలు పదును తేలుతున్నాయి. శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో వర్చువల్‌ ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ.. సమాజ్‌వాదీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘ఈ నకిలీ సమాజ్‌వాదీలు.. వ్యాపారాలు మూసివేస్తారు. ప్రజల్ని దోచుకుంటారు. వాళ్ల సన్నిహితులు, మాఫియా జేబులు నింపుతారు’ అంటూ అఖిలేశ్‌ యాదవ్ పార్టీపై వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పనితీరును కొనియాడారు. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారన్నారు. ఆదిత్యనాథ్ యూపీని మాఫియా కోరల నుంచి విముక్తి చేసి, చట్టబద్ధ పాలనను ఏర్పాటుచేశారని ప్రశంసించారు.

‘సమాజ్‌వాదీ పార్టీ రైతులు, పేదల కష్టాలను పట్టించుకోలేదు. ఆ పార్టీ ఎన్నికల్లో నేరస్థులకు టికెట్లు ఇచ్చింది. ఆ నకిలీ సమాజ్‌వాదీలు యూపీని ఆకలిలోకి నెట్టేస్తారు. కానీ భాజపా ప్రభుత్వం రైతులకు అందే ప్రయోజనాలను పెంచింది. వ్యాపారాలు తెరుచుకునేలా చేసింది. విపక్షాలు కనీస మద్దతు గురించి వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి.  మా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాత్రం కనీస మద్దతు ధరను నేరుగా రైతుల ఖాతాల్లోకే వేస్తోంది’ అంటూ సమాజ్‌వాదీ పార్టీ, ఇతర విపక్షాల వైఖరిని విమర్శించారు.

కరోనా టీకాలపై తప్పుడు ప్రచారం.. విపక్షాలు చివరకు కరోనా టీకాల గురించి కూడా తప్పుడు ప్రచారానికి పాల్పడ్డాయని ప్రధాని మోదీ ఆక్షేపించారు. ‘విపక్షాలు చేసిన ఆ ప్రచారాన్ని పట్టించుకోకుండా టీకా తీసుకున్న ప్రజలకు నా కృతజ్ఞతలు’ అని మాట్లాడారు. ఆ పార్టీలు గతంలో భాజపా చేతిలో ఓటమి చవిచూశాయని, ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి ఎదురవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో యూపీలో పోలింగ్ జరగనుంది. మార్చి 10న కౌటింగ్ చేపట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని