Huzurabad By Election: మావి ఓట్లు కావా..? మాకేవి డబ్బులు..?

హుజూరాబాద్‌లో ఓటర్లను ఆకర్షించేందుకు కొందరు తాయిలాలు ఇద్దామనుకొంటే.. అది కాస్తా వికటించి సరికొత్త గొడవలకు దారి తీస్తోంది.

Updated : 28 Oct 2021 16:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: హుజూరాబాద్‌లో ఓటర్లను ఆకర్షించేందుకు కొందరు తాయిలాలు ఇద్దామనుకొంటే.. అది కాస్తా వికటించి సరికొత్త గొడవలకు దారి తీస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నువ్వా.. నేనా.. అనే విధంగా పార్టీలు ప్రచారం చేశాయి. ప్రస్తుతం ప్రచార గడువు ముగియడంతో పలు గ్రామాల్లో డబ్బులు రాలేదని గొడవలు మొదలయ్యాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ప్రతి గ్రామానికి సీల్డ్‌ కవర్లలో డబ్బు చేరిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ప్రచారం విస్తృతం కావడంతో నియోజకవర్గంలోని పల్లెల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఓటుకు రూ.6 వేల చొప్పున ఇచ్చారని ప్రచారం గుప్పుమనడంతో డబ్బులు రానివారు రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. ‘మావి ఓట్లు కావా..? మాకు పైసలివ్వరా..’ అంటూ మహిళలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని అయిదు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ఈ గొడవ చోటుచేసుకుంది. గ్రామాల్లో ఆందోళనలు వ్యక్తమవుతుంటే.. పట్టణాల్లో వార్డు నాయకులను ఓటర్లు నిలదీస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న నాయకులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. స్థానికంగా ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకొని తమకు డబ్బులు ఇవ్వలేదని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రలోభాల పర్వంలో తమకు కచ్చితంగా ఓట్లు వేస్తారనుకున్నవారికి మాత్రమే తాయిలాలు పంపిణీ చేస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. సీల్డ్‌ కవర్లలో నగదు తగ్గినట్టుగా పేర్కొంటూ కొందరు ఆందోళన చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని