త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ?

కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వివిధ శాఖలతో ప్రధాని నరేంద్ర మోదీ గత నెల రోజులుగా జరుపుతున్న సమీక్ష సమావేశాలు...

Published : 02 Jul 2021 01:20 IST

దిల్లీ: కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వివిధ శాఖలతో ప్రధాని నరేంద్ర మోదీ గత నెల రోజులుగా జరుపుతున్న సమీక్ష సమావేశాలు నేటితో ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు పలువురు కీలక వ్యక్తులతో ప్రధాని గత కొన్ని రోజులుగా చర్చిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌తోపాటు ఐదు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు రానున్న నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణకు ప్రాధాన్యం నెలకొంది. మిత్రపక్షాలకు కూడా సరైన ప్రాముఖ్యతనిస్తూ ముందుకు పోవాలని భాజపా అగ్రనాయకత్వం భావిస్తోంది.

ఇప్పటికే 27 మంది పేర్లను పరిశీలించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మధ్యప్రదేశ్‌ నుంచి జోతిరాదిత్య సింథియాకు కేబినెట్‌ హోదా ఖాయంగా కనిపిస్తోంది. బిహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ, అసోం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్‌, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణె పేర్లను పరిశీలించినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఆ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశముంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌, ఎంపీ పంకజ్‌ చౌదరి, వరుణ్‌  గాంధీ, అప్నాదల్‌ అధ్యక్షురాలు అనుప్రియ పటేల్‌కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాకుండా అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చేలా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

బిహార్‌ నుంచి లోక్‌జనశక్తి నాయకుడు, దివంగత నేత రామ్‌ విలాస్‌ పాసవాన్‌ సోదరుడు పశుపతి పారస్‌కు అదృష్టం వరించవచ్చు. జేడీయూ నుంచి ఆర్‌సీపీ సింగ్, సంతోష్‌ కుమార్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. హరియాణా నుంచి సిర్సా ఎంపీ సునీతా దుగ్గల్‌ రేసులో ఉన్నారు. పరిశ్రమలు, వాణిజ్యం, న్యాయ, వ్యవసాయం, విద్య, పౌర విమానయానం, ఆహార శుద్ధి తదితర శాఖల్లో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే  నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూకి ఈ సారైనా కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుందా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కేంద్ర కేబినెట్‌లో 81 మంది మంత్రులు ఉండొచ్చు. కానీ, ప్రస్తుతం 53 మంది ఉన్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో 28 మంది వరకు నియమించే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని